వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆదికేశవ’. మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ ఇందులో విలన్ గా నటిస్తూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆదికేశవ’ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో సంయుక్తంగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కింది. ఈ ‘ఆదికేశవ’ చిత్రం నేడు (24 నవంబర్-2023) ప్రేక్షకుల తీర్పును కోరుతూ థియేటర్ లో అడుగు పెట్టింది. మరి ఈ ఆదికేశవుడు ఈ మేరకు ప్రేక్షకులను అలరించాడో తెలుసుకుందాం…
కథలోకి …. బాలు(వైష్ణవ్) చదువు అయిపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో అమ్మ జాబ్ తెచ్చుకోమని చెప్పడంతో చిత్ర(శ్రీలీల) సీఈవోగా ఉన్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. బాలు, చిత్ర ప్రేమించుకుంటున్నారని తెలిసి వాళ్ళ నాన్న ఇంకొకరితో అందరిముందు చిత్రకు పెళ్లి అనౌన్స్ చేస్తాడు. చిత్ర వాళ్ళ నాన్న బాలుని కొట్టిద్దాం అనుకున్న సమయంలో బాలు వాళ్ళ అమ్మ వచ్చి మేము నీ అసలు అమ్మ నాన్న కాదు, నీ సొంత నాన్న మహాకాళేశ్వర్ రెడ్డి(సుమన్) చనిపోయాడు అని అతని తరుపు వాళ్ళతో రాయలసీమకు పంపుతుంది. మహాకాళేశ్వర రెడ్డి ఎవరు? అతను ఎలా చనిపోయాడు? బాలు, చిత్రల ప్రేమ ఏమైంది? బాలు రాయలసీమకు వెళ్ళాక రుద్రా కాళేశ్వరరెడ్డిగా ఎలా మారాడు? మధ్యలో చెంగారెడ్డి మైనింగ్ కథేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : అన్యాయం చేస్తే సహించని, తప్పు చేసిన వారిని విచక్షణారహితంగా శిక్షించే యువకుడు బాలు అలియాస్ బాలకోటయ్యగా వైష్ణవ్ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. లవ్, ఎమోషన్స్, ఫ్యాక్షన్, మాస్, యాక్షన్, హిందుత్వం లాంటి కలగూర గంపలాంటి కథతో ఆదికేశవతో శ్రీకాంత్ రెడ్డి రాసుకొన్న రెగ్యులర్, రొటీన్ స్టోరీగానే సాగుతుంది. తొలి భాగంలో శ్రీలీల గ్లామర్, వైష్ణవ్ తేజ్ ఎనర్జీ చుట్టు రాసుకొన్న ఫ్యాక్షన్ సన్నివేశాలతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు జాలీగా, ఫన్‌తో నడిపించి.. ట్విస్టుతో ఇంటర్వెల్ సీన్‌తో కథను సీరియస్ నోట్‌లోకి తీసుకెళ్లడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో మాంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను భావోద్వేగంగా మలిచే ప్రయత్నం కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మితిమీరిన హింస తప్ప.. లాజికల్‌గా ఎమోషన్స్ వర్కవుట్ అయినట్టు ఎక్కడా అనిపించదు. చాలా ఆర్టిఫిషియల్‌గా సీన్లు ఉంటాయి. కేవలం వైష్ణవ్‌ను మాస్ హీరోగా చూపించడానికే ఈ సినిమా తీశారా? అనే సందేహం కలుగుతుంది. ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమాకు ముగింపు పలకడంతో కొత్తదనం ఏమీ లేదని తేలిపోవడమే కాకుండా.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసం డిజైన్ చేసిన సినిమాగా అనిపిస్తుంది. తన కెరీర్‌లో మూడు డిఫరెంట్ కథలను ఎంచుకొన్న వైష్ణవ్ తేజ్‌కు ఆదికేశవ కొత్త జోనర్. మాస్ ఎలిమెంట్స్, లవ్ మిక్స్ చేసిన కథలో బాలూగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఫస్ట్ టైమ్ మ్యాస్ క్యారెక్టర్, యాక్షన్ సీన్లకు పూర్తిగా న్యాయం చేశాడనే చెప్పాలి.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా కొంత యాక్టింగ్‌కు స్కోప్ పాత్రలో మెరిసింది. ఎప్పటిలానే మాస్ పాటల్లో స్టెప్పులతో ఇరుగదీసింది. క్రూరత్వంతో కూడిన విలనిజంతో జోజు జార్జ్ ఆకట్టుకొన్నాడు. సుమన్, జేపీ, రాధిక శరత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుదర్శన్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు బాగున్నాయి. వాటికి శ్రీలీల, వైష్ణవ్ తేజ్ న్యాయం చేశారు. బలంగా ఉన్న కొన్ని సీన్లలోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొన్నది. డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా మార్చింది. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. శ్రీలీలకు సంబంధించిన క్యాస్టూమ్స్ మరింత గ్లామర్‌ను పండించింది. నవీన్ నూలి ఎడిటింగ్ పనితీరు వల్ల సినిమా క్రిస్పీగా పరుగులు పెట్టించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. బలమైన కథ, సన్నివేశాలు లేకుండా రొటీన్, రెగ్యులర్ అంశాలతో రూపొందిన చిత్రం ఆదికేశవ. సినిమాలో ఎమోషన్స్ పండినట్టు ఎక్కడా కనిపించవు. శ్రీలీల గ్లామర్, వైష్ణవ్ ఎనర్జీతో, మాస్ ఎలిమెంట్స్‌తో నెగ్గుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఊరమాస్ ఎలిమెంట్స్‌కు మంచి కథ ఉండి ఉంటే.. మరో మంచి ఫ్యాక్షన్ డ్రామాగా మారి ఉండేదనిపిస్తుంది. దర్శకుడు కొత్తవాడైనా ట్విస్టులను డీల్ చేసిన విధానం బాగుంది. మితిమీరిన హింస ఈ సినిమాను కొంత వెనక్కినట్టు అనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా మాస్ అంశాలతో ప్యాకేజీగా ఆదికేశవ రూపొందింది. ఇది పూర్తిగా బి.సి. సెంటర్స్ మాస్ కమర్షియల్ సినిమా. చిన్నప్పుడే హీరోని సీమకు దూరంగా పంపడం, ఏదో ఒక సంఘటనతో అతను సీమకు తిరిగొచ్చి ఇక్కడ విలన్స్ ని చంపడం అనేది తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి కూడా ఇంచుమించు ఇలాంటి కథే. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ ప్రేమ, ఓ పాట, ఓ ఫైట్ అన్నట్టు సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో సీమకి వెళ్లడం, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ నాన్న గురించి, అక్కడి విలన్ గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసుకొని పోరాడటం జరుగుతుంది. కథనం అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. కాకపోతే లాజిక్ లెస్ సీన్స్ చాలా ఉంటాయి.
నటీనటుల విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో యూత్ హీరోలా కనపడి మెప్పించిన వైష్ణవ్ తేజ్ సెకండ్ హాఫ్ లో మాత్రం రుద్రకాళేశ్వర రెడ్డిగా వయసు మించిన పాత్ర చేసాడనిపిస్తుంది. హీరోయిన్ గా శ్రీలీల కమర్షియల్ సినిమాల్లో కేవలం సాంగ్స్, ప్రేమ సన్నివేశాలకు పరిమితమైనట్టే అయింది. కానీ ఎప్పటిలాగే తన డ్యాన్స్ తో, అందాలతో మెప్పించింది. ఇక విలన్ గా జోజు జార్జ్ కొంచెం పవర్ ఫుల్ గానే కనపడ్డాడు. హీరో ఫ్రెండ్ గా సుదర్శన్ కామెడీ పండించాడు. హీరో తల్లిగా రాధిక, అసలు తండ్రిగా సుమన్, పెదనాన్నగా తనికెళ్ళ భరణి, విలన్ భార్య పాత్రలో సదా చక్కటి నటనను కనబరిచారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. కెమెరా విజువల్స్ బాగా రిచ్ గానే చూపించారు. ఇక ఫైట్స్ బోయపాటి సినిమాలని మించి ఉంటాయి. ఫైట్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేశారని చెప్పొచ్చు. ఒక పాత కథ, పాత కమర్షియల్ పంథాని తీసుకున్నా డైరెక్టర్ శ్రీకాంత్ సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా సాగించాడు. మొత్తంగా తన పుట్టిన వాళ్ళకి, ఊరుకి దూరంగా పెరిగిన హీరో ఒక సంఘటనతో తన పుట్టిన ఊరుకి వెళ్లి అక్కడ సమస్యలు ఎలా తీర్చాడు అనే ఓ కమర్షియల్ కథ. వైష్ణవ్ మొదటిసారి చేసిన ఊర మాస్ ఫైట్స్, శ్రీలీల డ్యాన్సుల కోసం థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు
( చిత్రం : ఆదికేశవ, విడుదల తేదీ: 24 నవంబర్-2023, రేటింగ్ :2.5/5 నటీనటులు: వైష్ణవ్ తేజ్ పంజా, శ్రీలీల, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ, జేపీ, ఆనంద్. అపర్ణ దాస్, తదితరులు. రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి, నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫి: డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్ రిలీజ్ )