సిఎల్పీ ఆఫీసులో కొడంగల్ టిఆర్ఎస్ గుర్నాథ్ రెడ్డి ప్రత్యక్షం

ఇదొక షాకింగ్ న్యూస్.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్ రెడ్డి గతంలోనే టిఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయనకు ఈసారి ఎన్నికల్లో టిఆర్ఎస్ సీటు లేదని తేల్చి చెప్పింది.  పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడైన పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ లో బరిలోకి దింపుతున్నట్లు టిఆర్ఎస్ ప్రకటించింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన గుర్నాథ్ రెడ్డి 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్ లో చేరారు. కానీ రేవంత్ మీద ఓడిపోయారు.

ఈసారి టిఆర్ఎస్ లో టికెట్ దక్కుతుందేమో అన్న ఆశతో ఉన్నప్పటికీ ఆయన ఆశలపై గులాబీ బాస్ నీళ్లు చల్లారు. తన వయసు అయిపోయింది కాబట్టి తన కొడుకుకైనా టికెట్ ఇస్తారేమో అని గుర్నాథ్ రెడ్డి ట్రై చేశారు. కానీ రేవంత్ ను ఢీకొనాలంటే గుర్నాథ్ రెడ్డి కానీ, ఆయన కొడుకు కానీ సరితూగలేరన్న ఉద్దేశంతో పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది టిఆర్ఎస్  అధిష్టానం.

 

అసెంబ్లీలోని సిఎల్పీ ఆఫీసులో కూర్చుని సిఎల్పీ సెక్రటరీ శ్రీకాంత్ తో మాట్లాడుతున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టిఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి

ఈ పరిస్థితుల్లో ఉన్నట్లుండి సడెన్ గా గుర్నాథ్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలోని సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. సిఎల్పీ ఆఫీసులో చాలాసేపు కూర్చున్నారు. సిఎల్పీ సిబ్బంది శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులతో ముచ్చటించారు. పాత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తరుపున శాసనసభకు గుర్నాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో, అధికార పక్షంలో ఉన్న సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అంత సుదీర్ఘ అనుభవం ఉన్నా ఆయనకు మాత్రం ఎందుకో లెక్కలు సరిపోక మంత్రి పదవి మాత్రం దక్కలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గుర్నాథ్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. గతసారి టికెట్ వచ్చింది. ఈసారి టికెట్ కూడా లేకపోవడంతో ఇక తాను అసెంబ్లీలో కాలు పెట్టలేనన్న బాధతో ఆయన ఉన్నారు. సిఎల్పీ ఉద్యోగుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

గుర్నాథ్ రెడ్డి సిఎల్పీ ఆఫీసులో కూర్చున్న విషయం క్షణాల్లో కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి అయిన ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డికి తెలిసింది. దీంతో ఆయన వరుసగా మూడు సార్లు గుర్నాథ్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే అసెంబ్లీలోని సిఎల్పీ ఆఫీసు నుంచి వెళ్లిపోవాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి గుర్నాథ్ రెడ్డి వెళ్లిపోయే వరకు కూడా నరేందర్ రెడ్డి వదలకుండా కాల్ చేశారని సిఎల్పీ బీట్ కవర్ చేసే జర్నలిస్ట్ మిత్రులు తెలిపారు.

ఈ విషయమై సిఎల్పీ సిబ్బందిని ఆరా తీయగా తెలిసిందేమంటే… గుర్నాథ్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ అసెంబ్లీ లోని బ్రాంచ్ లో ఉంది. బ్యాంకు పని మీద ఆయన అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. బ్యాంకులో కొద్దిసేపు టైం పడుతుందని అధికారులు చెప్పడంతో అక్కడే కూర్చోలేక సిఎల్పీ ఆఫీసుకు వచ్చినట్లు తెలిపారు. పది నిమిషాల కంటే ఎక్కవ సేపు కూర్చోలేదని వారు వివరించారు.

అయితే గుర్నాథ్ రెడ్డి టిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయన టిఆర్ఎస్ ఎల్పీకి వెళ్లలేదు. ఎందుకంటే టిఆర్ఎస్ ఎల్పీ సిబ్బంది అంతా కొత్త వారు కావడం ఒకటైతే.. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. సిఎల్పీ ఆఫీసులో సెక్రటరీ శ్రీకాంత్ తో తనకు దగ్గరి పరిచయం ఉన్నందున సిఎల్పీ ఆఫీసుకు వచ్చి కూర్చొని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.