Telangana: 20 లక్షలు ఇచ్చిన సూది మొనంత భూమి కూడా ఇవ్వం!

Telangana: తెలంగాణలో లగచర్ల గ్రామ ఘటన రోజుకోక మలుపు తిరుగుతుంది. గతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అందుకుగాను భూ సేకరణ కోసం అధికారులు ఈ గ్రామంలో పర్యటన చేయగా అధికారుల పై గ్రామస్తులు దాడి చేయడమే కాకుండా తమ భూమి ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించారు దీంతో రేవంత్ సర్కారు వెనకడుగు వేసింది.

ఇలా ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన 48 గంటలలోనే ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు..దీని కోసం లగచర్ల ప్రాంతంలో భూమి ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా పరిశ్రమలు రావాలి అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందేనని ఈయన తెలిపారు. ఇలా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం కోసం భూమి ఇచ్చే రైతులకు ఎకరాకు 20 లక్షలు చొప్పున పరిహారం అందించబోతున్నట్లు ఈయన తెలిపారు.

రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడంతో ఒక్కసారిగా లగచర్ల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంటలు పండే మా భూములను అసలు ఇవ్వమని తేల్చి చెబుతున్నారు ఎకరానికి 20 లక్షల కాదు కదా ఎంత ఇచ్చిన సూది మొనంత భూమిని కూడా ఇవ్వమని తేల్చి చెబుతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి మా భూములే మీకు కనిపిస్తున్నాయా..నీ కొండారెడ్డిపల్లిలో లేవా? కోస్గిలో లేవా? ఇక్కన్నే ఎందుకు? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా అంటూ గిరిజనులు నిలదీస్తున్నారు.

ఇక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణకు ఎవరు అడ్డు రాకూడదని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు కానీ గిరిజన రైతులు మాత్రం తమ భూములను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు దీంతో ఏ క్షణం ఏం జరగబోతుందోనని ప్రతి ఒక్కరు ఎంతో భయాందోళనలలో బ్రతుకుతున్నారు.