రేవంత్ రెడ్డి ‘విధ్వంస’ రాజకీయమే కాంగ్రెస్ కొంప ముంచుతోంది.!

అసలు రేవంత్ రెడ్డికి ఎందుకింత ఫ్రస్ట్రేషన్.? ఆయనో ఎంపీ.. పైగా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడాయె.! కానీ, ఆయనకున్న పదవులు.. ఆయన నోటి దురద ముందు ఓడిపోతున్నాయ్. ముఖ్యమంత్రి ఎవరైనా.. ఆ స్థానానికి ఓ గౌరవం వుంటుంది. ముఖ్యమంత్రి క్యాప్ ఆఫీస్ అంటే.. దానికీ ఓ గౌరవం వుండి తీరాలి.

అలాంటి క్యాంప్ ఆఫీసుని నక్సలైట్లు బాంబులతో పేల్చేయాలని అనడమేంటి.? ఎలా చూసినా, రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదేమో అన్న భావన కలుగుతోందంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

రాజకీయాల్లో విమర్శలు మామూలే. కానీ, ఆ విమర్శలకూ ఓ హద్దుండాలి. స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తే సభ్య సమాజం హర్షించదు. పైగా, క్యాంప్ ఆఫీసుని పేల్చేయాలంటూ నక్సలైట్లకు ఓ ప్రజా ప్రతినిథి.. అందునా ఓ ఎంపీ.. పైగా, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనడం అస్సలు సమర్థనీయం కాదు.

ఇవే, రేవంత్ రెడ్డి ‘నాయకుడిగా’ మరింత ఉన్నత స్థానానికి ఎదగనీయుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గతి లేక గానీ.. లేకపోతే, రేవంత్ రెడ్డిని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఎలా చేస్తారు.?

రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇటీవలి కాలంలో సాధించిందేంటి.? ఏమీ లేదు. క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రజాధనంతో నిర్మించిందన్న కనీస సోయ లేని వ్యక్తి, ఓ ఎంపీగా వుండడం హాస్యాస్పదమే.

కాగా, రేవంత్ రెడ్డిపై పోలీసులకు పిర్యాదులు అందుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఎడా పెడా ఫిర్యాదులు చేస్తున్నారు. కేసులు ఆయనకు కొత్త కాదు. కానీ, ఈ తరహా కేసులు మాత్రం రాజకీయంగా ఆయనకు చెంప పెట్టులాంటివే.