రేవంత్ రెడ్డి రివర్స్ స్కెచ్ , ఇరకాటంలో టిఆర్ఎస్

రాజకీయ వ్యూహాలు రచించడంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పరిణతి సాధించారా? గతంలో ఉన్న ఆవేశం కంటే ఇప్పుడు ఆలోచనతో రేవంత్ యాక్షన్ లోకి దిగుతున్నారా? ఐటి దాడులతో ఉచ్చులో బంధీ అయి జైలుకు వెళ్లాల్సిన రేవంత్ బయటే ఉన్నారంటే కారణమేంటి? రేవంత్ వేసిన చిన్న రివర్స్ స్కెచ్ తో టిఆర్ఎస్ ఇరకాటంలో పడిందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంతకూ రేవంత్ రివర్స్ స్కెచ్ ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని కట్టబెట్టింది. అయితే రేవంత్ కు పదవి వచ్చిందన్న సంతోషం కంటే పదవి రాగానే అక్రమ కేసులేసి జైలుకు పంపుతారన్న అనుమానం బలంగా ఉందని చెబుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ పదవి వచ్చిన తర్వాత వారం రోజులపాటు మీడియా ముందుకు కూడా రాలేదు. రేవంత్ పదవి వచ్చినంక అధికార పార్టీని కడిగి పారేస్తాడనుకుంటే ఎటు పోయిండబ్బా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ రేవంత్ ఆ సమయంలో అసలు వ్యూహాలు రచించాడని ఇప్పుడు తన అనుచర వర్గానికి అర్థమైంది. 

నిజానికి రేవంత్ రెడ్డి తనకు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి వచ్చిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో తెలుసా? తన మీద కుట్ర పన్నుతున్నారని, తనను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని సర్కారు మీద ఆరోపణలు గుప్పించారు. పదవి వచ్చిందన్న సంతోషం లేకుండా రేవంత్ గిట్లా మాట్లాడిండేందబ్బా అని కేడర్ షాక్ అయ్యారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ఇంటి మీద ఐటి దాడులు మొదలైన రోజు ఆయన కొడంగల్ లో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఆ సమయంలో కోస్గిలో జరిగిన సభలో సైతం రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు.

తన మీద కుట్ర పన్ని కేసులు వేశారని, ఐటి దాడులు, ఇడి దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ అనుమానాలు వ్యక్తం చేశారు. పదవి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏం మాట్లాడిండో కోస్గిలోనూ అదే మాటలు చెప్పారు. అంతేకాదు అన్నీ మంచిగ జరిగితే మల్లా ప్రచారానికి వస్తా.. లేదంటే జైలు నుంచే నామినేషన్ కాయితాలు పంపుతా. ఇక మీరే చూసుకోవాలి అని కూడా ఆయన ఒకింత ఆందోళనకరంగా మాట్లాడారు. అలా మాట్లాడి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు.  తన నివాసంలో రెండు రోజులపాటు ఐటి సోదాలు జరిగితే వారికి సహకరించారు. తర్వాత ఈనెల మూడో తేదీన రావాలని ఐటి అధికారులు నోటీసు ఇచ్చి వెళ్లారు.

మంగళవారం రేవంత్ ఐటి అధికారుల ముందు కేసుకు హాజరయ్యారు. రెండు గంటలపాటు వాళ్లు అడిగింది చెప్పి బయట పడ్డారు. అయితే ఈ విషయంలో రెండు రోజులపాటు సోదాలు చేసినప్పుడే రేవంత్ అరెస్టు అని పుకార్లు వచ్చాయి. కానీ అరెస్టు చేయలేదు. ఇక మూడో తేదీన విచారణకు రాగానే గతంలో జగన్ ను అరెస్టు చేసినట్లు రేవంత్ ను కూడా విచారణ జరిపి అటనుంచి అటే అరెస్టు చేసి జైల్లో వేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ రెండు గంటల్లోనే విచారణ అయిపోయింది. రేవంత్ తిరిగి కొడంగల్ పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. రెండోసారి విచారణలో కూడా పాత విషయాలే అడిగినట్లు తెలిసింది. అయితే చాలా సరదాగా, నవ్వుతూ విచారణ జరిగిందని అంటున్నారు. 

ఒకవైపు రేవంత్ రెడ్డే తనను అరెస్టు చేస్తారని మీడియా సాక్షిగా, కోస్గిలో జనాల సాక్షిగా  ప్రకటనలు గుప్పించినా రేవంత్ రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలేశారు. అంతేకాదు రహస్య నివేదికను అన్ని మీడియా చానెళ్లకు, పత్రికలకు పంపిన సమయంలో అన్ని టివిలు రేవంత్ ను అరెస్టు చేస్తాయని ప్రసారాలు చేశాయి. కానీ అదేం జరగలేదు. అసలు ఇంతకూ అటు రేవంత్ రెడ్డి భయపడుతూ మాట్లాడిన మాటలు, ఇటు టిఆర్ఎస్ వర్గాలు  చేసిన ప్రచారం రెండు తప్పని తేలిపోయాయి.

మరి రేవంత్ ఎందుకు అలా మాట్లాడారు. తనకు అరెస్టు చేస్తారన్న సమచారం ఉంటేనే కదా అలా మాట్లాడుతారు అని డౌట్ రావొచ్చు. కానీ అసలు ముచ్చటేందంటే.. ఇది రేవంత్ న్యూ స్టయిల్ స్కెచ్. ఇంతకాలం ఆవేశంలో మాట్లాడిన రేవంత్ పలుసార్లు ఇబ్బందులు పడ్డారు. ‘‘కానీ ఈసారి ఆలోచనతో స్కెచ్ వేశారు. ప్రత్యర్థి టిఆర్ఎస్ నే టెన్షన్ లో పెట్టారు. అదేమంటే అదే రివర్స్ పంచ్. తనను అరెస్టు చేస్తారేమో అని రేవంత్ చేసిన కామెంట్స్, జైలు నుంచి నామినేషన్ పంపుతానని మాట్లాడిన మాటలన్నీ గులాబీ బాస్ అంటే భయంతో చేసినవి కాదు.. వ్యూహంతో చేసిన కామెంట్స్’’ అని రేవంత్ ముఖ్య అనచరుడు ఒకరు తెలిపారు. రేవంత్ వేసిన స్కెచ్ పారింది. అరెస్టు చేద్దామనుకున్న టిఆర్ఎస్ అడుగు ముందుకు వేయలేకపోయింది అని ఆయన వెల్లడించారు.

రేవంత్ సుదీర్ఘ ఆలోచన చేసిన తర్వాతే తనను అరెస్టు చేయబోతున్నారని ఫీలర్ వదలడంతో టిఆర్ఎస్ డైలమాలో పడిందని అన్నారు. ముందే రేవంత్ తనను అరెస్టు చేసే చాన్స్ ఉందని ప్రకటించడంతో ఆయనను ముట్టుకునేందుకు కూడా భయపడిపోయిందన్నారు. అంతేకాదు పత్రికా ఆఫీసులకు, టివి ఆఫీసులకు రహస్య నివేదికలు పంపి టిఆర్ఎస్ పార్టీ మరింత దిగజారిపోయిందన్నారు. ఇక అరెస్టు చేసే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. ఇదంతా రేవంత్ పక్కా ప్లాన్ తో వేసిన రివర్స్ స్కెచ్ అని ఆయన తేటతెల్లం చేశారు. 

ఏదైతేనేమీ రేవంత్ మాత్రం అరెస్టు కాలేదు. ఇక కాలుకు బలపం కట్టుకుని తెలంగాణ అంతటా కలియదిరగడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో ఉంటే చెవిలో జొర్రీగలా, నెత్తిన పేనులా, కంటిలో నలుసులా తమను ఎక్కడ ఇరకాటంలో పెడతాడేమోనని టిఆర్ఎస్ వాళ్లు ఆందోళనతో ఉండడం ఖాయమని తేలిపోయింది.