హైదరాబాద్: ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలు ప్రయోగించటంపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఢిల్లీలో దాడి జరగడం అమానుషమని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులపై జరిగిన దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించిందన్నారు రేవంత్ రెడ్డి.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రైతుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతన్నలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ కి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని మండిపడ్డారు. ఢిల్లీ వీధుల్లో రైతన్న పై దాడి చేసిన చరిత్ర ప్రధాన మంత్రి మోడి కే దక్కుతోందన్నారు రేవంత్. ఇది రైతు ప్రభుత్వం కాదని.. అదాని, అంబానీల ప్రభుత్వమని ఆరోపించారు. ఈ దాడితో మోడీ, అమిత్షా పతనానికి నాంది పడిందన్నారు.