రేవంత్ రెడ్డికి పిసిసి ఉత్తమ్ షాక్

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడు తన అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టారు. ఎన్నికల హడావిడి మొదలైన తరుణంలో 25 సీట్లు తన వర్గానికి ఇవ్వాలని జాబితాను ఏఐసిసికి అందజేశారు రేవంత్. కానీ ప్రస్తుతం కేటాయించిన అసెంబ్లీ సీట్లలో అసలు ఆ జాబితాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి పార్టీలో చేరినప్పుడే కొంత మంది ముఖ్య నేతలు రేవంత్ ను వ్యతిరేకించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా ఉంచారు. ఎన్నికల వేళ ఆయన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. రేవంత్ ప్రచార కమిటి చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడంతో ఆయన కాస్త అసంతృప్తికి గురైనా కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యం తనది కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోనే రాష్ట్రమంతా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.

సీట్ల కేటాయింపు విషయంలో పిసిసి ముఖ్య నేతల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. కొంత మంది నేతలు తమ వారసులకు టికెట్లు అడుగుతుండగా మరికొంత మంది తమ అనుచరులకు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏకంగా 25 మంది తన వర్గానికి టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని కోరినట్టు తెలుస్తోంది.

కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అసలు ఆ జాబితాను పట్టించుకోవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను పట్టించుకున్నట్లైతే కుమ్ములాటలు తప్పవని, అందుకోసమే దానిని పట్టించుకోకుండా ఉండాలని ఉత్తమ్ సూచించినట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే లీడర్ గా ఎదిగారు. కాంగ్రెస్ లో కి వచ్చిన తర్వాత కూడా ఆయన హవా తగ్గలేదు. ఆయనను ముందుగా చాలా మంది నేతలు వ్యతిరేకించినప్పటికి ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ను చూసి అంతా ఆయనకు దగ్గరయ్యారు. చాలా మంది తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు. రేవంత్ ప్రచారం చేస్తే ఆయన వేసే పంచ్ డైలాగ్ లతో ప్రజలను ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో నేతలున్నారు.

కానీ ఆయన చెప్పిన వారికి టికెట్లు ఇస్తే పార్టీలో రేవంత్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరని అందుకే ఉత్తమ్ హైకమాండ్ దగ్గర రేవంత్ వర్గానికి చెక్ పెట్టినట్లు ఢిల్లీ నుండి గుసగుసలు వినబడుతున్నాయి.