నయీం కేసు: రెండేళ్లలో అంతా గప్ చుప్

నయీం కేసులో సస్పెన్షన్ అయిన పోలీసుల పై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేయగా వారు డిజిపి ఆఫీసులో రిపోర్టు చేశారు.  నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా సీఐడి ఎఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్ చౌక్ ఏసీపీ మలినేని శ్రీనివాస్ పై  గతంలోనే సస్పెన్షన్ ఎత్తివేయడంతో వారు విధుల్లో చేరిపోయారు. సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ మస్తాన్ వలిల పై కూడా సస్పెన్షన్ ఎత్తివేయడంతో వారు మంగళవారం డిజిపి ఆఫీసులో రిపోర్టు చేశారు. వారికి కూడా త్వరలోనే పోస్టింగ్ లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

పోలీసుల వేట ఒళ్లు జలధరింప జేసింది. నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన తుపాకి తూట.. హంతకుడి చరిత్రకు ఘోరి కట్టింది. బాధిత జన హృదయాలను సంతోషింపజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నరహంతక నయీం ఎన్ కౌంటర్ జరిగి సరిగ్గా నేటికి రెండేళ్లు. నయీం హతం తర్వాత తదనంతర పరిస్థితిపై తెలుగు రాజ్యం ప్రత్యేక కథనం…

నయిమోద్దీన్… యాదాద్రి భువనగిరి అతని స్వస్థలం. నయిం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. భువనగిరిలో ప్రజా గాయని బెల్లి లలిత దారుణ హత్య మొదలుకొని కొనపురి రాములు వరకు నయీం అనేక మందిని కిరాతకంగా హతమార్చారు. ఆ రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పాలకులు ఎవరైనా సరే నయీం అంటే అందరికి బెదురే.

గ్రేహౌండ్స్ ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులో ఇతను  నిందితుడు. 1993 జనవరి 27న నయీం ఎల్బీ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న వ్యాస్ ను కాల్చి  చంపి పరారయ్యాడు. ఆ తర్వాత పౌరహక్కుల నేతలు పురుషోత్తం, ఆజం అలీ కరుణాకరును నయీం మనుషులు పట్టపగలే నరికి చంపారు. మావోయిస్టులు గణేష్ , ఈదన్న హత్య వెనుక కూడా నయీం ప్రమేయం ఉంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, సాంబశివుడు, కొనపురి రాములు వీరందరిని కూడా నయీం హత్య చేశాడు. నయీం టీనేజ్ అమ్మాయిలతో లైంగిక వాంఛలు తీర్చుకునే వాడు. ఒక్కో సారీ ఒక్కో ఇల్లు మార్చి నివసించేవాడు నయీం ఇలా 23 ఏళ్ల పాటు నేర సామ్రాజ్యాన్ని నడిపాడు నయీం.

నయీం కి రాజకీయ నాయకులు, పోలీసుల అధికారుల మద్దతుతోనే తన దందాలు కొనసాగించాడు. నయీం భూదందాలు, సెటిల్మెంట్లు చేసేవాడు.  ఎల్బీనగర్, ఉప్పల్ హయత్ నగర్, ఫిర్జాదిగూడ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నయీం తన దందాలను కొనసాగించారు. నయీం ఆగడాలను భరించలేక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారందరిని ఏదో రకంగా భయపెట్టి కేసు  వాపస్ చేయించేవాడు. అలా తన వేధింపులు ఎక్కువవడంతో ఓ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట. దాంతో సీఎం ఈ కేసును సీరియస్ గా తీసుకొని పోలీసు అధికారులతో చర్చించారు.

అది 2016 ఆగష్టు 8వ తేది. షాద్ నగర్ పట్టణ శివారులోని మిలీనియం టౌన్ షిప్. అప్పుడే తెల్లతెల్లవారుతుంది. అంతా నిద్ర లేస్తున్నారు. ఇంతలో చీమ చిటుక్కుమనకుండా వందలాది మంది పోలీసులు ఓ ఇంటిని చుట్టు ముట్టారు.  స్థానికులను పోలీసులు అలర్ట్ చేశారు. ఇంటి లోపల  ఉన్న  వ్యక్తులకు మాత్రం బయట ఏం జరుగుతుందో తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఆ ఏరియానంతా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది గమనించినట్టున్నాడు ఆ ఇంటిలోని వ్యక్తి  పోలీసులపైకి తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. కాపు కాసి కూర్చున్న పోలీసులు క్షణాల్లో తుపాకుల మోత మోగించారు. పోలీసు తూటాల దెబ్బకు ఓ భారీ ఆకారం కుప్పకూలిపోయింది. అంతే అక్కడి వెళ్లి చూసే సరికి ఆ ఆకారం అండర్ డాన్ నయీం దిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విజయవంతంగా తమ ఆపరేషన్‌ను పూర్తి చేశారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను గడగడలాడించిన నయీం హతమయ్యాడు. దాంతో నయీం అంటే గజ్జున వణికిపోయేవారు ఊపిరి పీల్చుకున్నారు. పీడవిరగడమైంది అని అంతా అనుకున్నారు. నయీం హతంతో అతని నేర సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోయింది. నయీం మరణం తర్వాత విచారణలో పలు నిజాలు తేలడంతో నయీం కి సహకరించిన పలువురు పోలీసులపై ప్రభుత్వం వేటు వేసింది. ఇప్పటకి కూడా నయీం పేరు వింటే చాలా మంది భయపడిపోతున్నారు. నయీం హతంతో పెద్ద దరిద్రం పోయిందని పలువురు అంటున్నారు.

ఇదిలా ఉంటే నయీం కేసులో ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అందరిని శిక్షిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలందరికి నయీంతో సంబంధాలున్నాయని తేలినా వారిపై సర్కార్ చర్యలు తీసుకోలేదు. పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేసి వారికి పోస్టింగ్ లు ఇచ్చారు. నయీం సంపద అంతా ఏమైందో ఇప్పటికి కూడా జనాలకు మిస్టరీగానే మిగిలింది.