తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎల్పీ ఆవరణలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు లాభమా? నష్టమా అన్న అంశంపై ఆదివారం తెలంగాణ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరుపున హాజరైన వారు తెలంగాణ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సుదీర్గమైన మీడియా సమావేశంలో హరీష్ కాంగ్రెస్ ను తిట్టడానికే పరిమితమయ్యారు. అయితే జెఎసి లేవనెత్తిన సందేహాలకు మాత్రం హరీష్ సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో హరీష్ పై రేవంత్ విమర్శల దాడికి దిగారు. రేవంత్ ఏమన్నారో కింద చదవండి.
నీళ్ల ను అడ్డపెట్టుకుని ప్రభుత్వం వేల కోట్లు దోచుకుంటున్నది. తెలంగాణ భావి తరాలను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. 11వేల కోట్లు ప్రాణహిత కు నాటి కాంగ్రెస్ ఖర్చు చేసింది. 34 వేల కోట్ల నుండి డిజైన్ మార్చి కాలేశ్వరం పేరుతో 84వేల కోట్లకు కేసిఆర్ ప్రభుత్వం పెంచింది వాస్తవం కాదా? మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా హరీష్ ఎదురుదాడి చేశారు. నల్ల తాచు కంటే ఎక్కువ విషాన్ని హరీష్ కాంగ్రెస్ ,జేఏసీ లపై కక్కుతున్నారు. ఏ రోటికాడ ఆ మాట హరీష్ పాడుతుంది హరీష్ రావే. సూర్యాపేట, పెద్దపల్లి, కరీం నగర్ లో హరీష్ చెప్పిన మాటలు గుర్తున్నాయా ఇంతకు ఎవరికి తొలి ఫలితం కింద నీళ్ళు వస్తాయో హరీష్ చెప్పాలి. నిళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలని టీఆరెస్ చూస్తున్నది. కేసీఆర్ కొత్తగా మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు హరీష్ చెప్పాలి. హరీష్ పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, ప్రాణహిత, నిజాం సాగర్ ఎక్కడికొస్తావో చెప్పు. నేను వస్తా బహిరంగ చర్చ జరుపుదాం. అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం లా కేసీఆర్, హరీష్ లు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు.
ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టులో భాగంగా 17 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాన్ని కెసిఆర్ ప్రభుత్వం ఆపింది నిజం కాదా? కాంట్రాక్టర్ లు కమిషన్ ఇవ్వనందుకే కేసీఆర్ ఎస్ఎల్ బిసి పనులను ఆపారు. ఉద్యమ సమయంలో కానీ, మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా రీడిజైన్ ల గురించి టీఆర్ఎస్ ప్రస్తావించని మాట నిజం కాదా? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకునేందుకే ప్రాజెక్టు ల రీడిజైన్, మిషన్ భగీరథలు తప్ప జనాలకేం లాభం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నింస్తుంటే మాపై దూషణలకు దిగుతున్నారు. కొడుకు, అల్లుడుకు తండ్రి కేసీఆర్ వాటాలు పంచుతున్నారు. నేను హరీష్ కు సవాల్ విసురుతున్నాను. సాగునీటి ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చకు హరీష్ సిద్ధమా? గన్ పార్క్ దగ్గరైనా ..ప్రెస్ క్లబ్ లోనైనా చెప్పు ..వచ్చెనందుకు నేను రెడీ. మా వాదన తప్పైతే నేను ముక్కు నెలకు రాస్తా. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టొద్దని నాడు నిపుణులు నివేదిక ఇచ్చింది నిజం కాదా? టోపోగ్రఫి, డ్రోన్ సర్వేలతో చెప్పిన రిపోర్ట్ నిజం కాదా ? కాళేశ్వరం ముసుగులో లబ్ధిదారులు, సూత్రదారులు, వాటాదారులు ఎవరో చెప్పాలి. కాళేశ్వరం పూర్తయితే బ్యాంక్ లోన్ ల కారణంగా ఎకరాకు ఒక లక్ష 54 వేలు ఖర్చవుతుంది. ఈ ప్రభుత్వం తీరుతో భారం ఎవరు భరించాలి?
కుటుంబ దోపిడీకి మేము వ్యతిరేకమే తప్ప ప్రాజెక్టు లకు కాదు. కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీకి బరాబర్ మేము వ్యతిరేకమే. కెసిఆర్ ..నీళ్ల ముసుగులో చేస్తున్న దోపిడీకి మేము అడ్డం పడతం. కాళ్ల సందుల కట్టెలు పెట్టుడు కాదు మీ దోపిడీకి అడ్డంగా బరాబర్ గా నిలబడతాం. ప్రభుత్వం చేసిన రెండున్నర లక్షలు కోట్ల అప్పును పంచితే ప్రజలకు ఒక్కొరికి లక్ష రూపాయలు ఇవ్వొచ్చు. ప్రాజెక్టు ల నిర్మాణం గురించి హరీష్ కు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి ఉందా? ప్రాణహిత చేవెళ్ల, పాలమూర్ రంగారెడ్డి లు కాంగ్రెస్ మానస పుత్రికలు. ప్రాజెక్టు లపై హరీష్ చెప్పిన అబద్దాలు నమ్మొద్దు. పోలవరానికి వేల ఎకరాలను ఆంధ్రాకు ఇచ్చిన కేసీఆర్ మహారాష్ట్ర నుండి 1800 ఎకరాలను ప్రాణహిత కోసం తేలేకపోయారు. మహారాష్ట్రకు ప్రాజెక్టు లోనే కాదు ..నీళ్ల లో చేపలల్లో వాటా ను కెసిఆ రాసిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం లో అందరు కేడీలే. హరీష్ భూములకు ఇస్తున్న 12 లక్షల రూపాయలను సామాన్య రైతుల భూములకు ఎందుకు ఇవ్వరు? హరీష్ భూములు ఏమైనా బంగారమా? హరీష్ కు నీతి నిజాయితీ ఉంటె నీళ్ళు -నిజాలపై చర్చ కు రావాలి.