రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో మంత్రి హరీష్ రావు మళ్లీ ఆపరేషన్ చేపట్టారు. ఇది ఆపరేన్ ఆకర్ష్. దీని ద్వారా హరీష్ రావు ఒక టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఇంతకూ హరీష్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? ఆయన రీచ్ అయిన టార్గెట్ ఏమిటి? చదవండి.
తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు మూడు వేల మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ గూటికి చేరడం కొడంగల్ లో చర్చనీయాంశమైంది.
ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు విపక్షాలపై మరింత డోస్ పెంచారు. మాటల దాడి కొనసాగించారు. మహా కూటమిని కడిగి పారేశారు. తెలంగాణ జన సమితి నేత కోదండరాం ను మరీ ఘోరంగా తిట్టి పారేశారు. కోదండరాం కు రైతుల ఉసురు తగులుతుందంటూ పరుషమైన భాషలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును, కాంగ్రెస్ నేతలను ఎవరినీ వదలకుండా విమర్శల పరంపర కొనసాగించారు. బిజెపిని, ఎంఐఎం ను తప్ప అన్ని పార్టీలను తిట్టని తిట్లు తిట్టకుండా తిట్టేశారు.
ఈ జాయినింగ్ ద్వారా హరీష్ కొడంగల్ లో ఒక టార్గెట్ రీచ్ అయ్యారని అంటున్నారు. అదేమంటే కొడంగల్ లో టిఆర్ఎస్ వాళ్లు ఎన్ని సర్వేలు చేయించినా రేవంత్ రెడ్డి మాత్రమే గెలుస్తాడని రిపోర్టులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఎలాగైనా కొడంగల్ లో రేవంత్ ను ఓడించాలంటే టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ ను దింపడం మినహా మార్గం లేదని గులాబీ పెద్దలు భావించారు. అందుకే హరీష్ చేత అక్కడ ఆపరేషన్స్ చేయించారు. గత ఐదారు నెలలుగా నెలలుగా హరీష్ ఆపరేషన్స్ కొడంగల్ లో సాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొడంగల్ లో వన్ సైడ్ గా ఉన్న పరిస్థితిని కొద్దోగొప్పో హరీష్ మార్చగలిగారు.
కొడంగల్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గుర్నాథ్ రెడ్డి, తాజా అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మధ్య సమన్వయం సాధించగలిగారు హరీష్ రావు. బుధవారం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నవారంతా గుర్నాథ్ రెడ్డి తీసుకొచ్చిన వారే అని అంటున్నారు. అంటే వారి కుటుంబానికి టికెట్ రాలేదన్న బెంగ తీరిపోయిందని ఈ విషయంలో తేలిపోయింది. గుర్నాథ్ రెడ్డి వర్గం ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి వర్గంతో కలిసిపోయిందని స్పష్టమైంది. ఈ రకమైన టార్గెట్ ను హరీష్ రీచ్ అయ్యారు.
కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంతకాలం గుర్నాథ్ రెడ్డి వర్గం, పట్నం నరేందర్ రెడ్డి వర్గం మధ్య విబేధాలు ఉన్నాయన్న ఆలోచనలో ఉన్నారు. వారిద్దరి విబేధాలను సద్వినియోగం చేసుకుంటే తన గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఇప్పుడు వారిద్దరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన హరీష్ రావు రేవంత్ కు గట్టి సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ లోని రెండు గ్రూపుల మధ్య విబేధాలు తనకు అనుకూలంగా మార్చుకుని గెలుస్తానన్న భరోసా లేకుండా రేవంత్ ను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో హరీష్ ఆపరేషన్ సాగినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో రేవంత్ వ్యూహం మార్చక తప్పని పరిస్థితిని హరీష్ కల్పించారని చెప్పవచ్చు. అయితే రేవంత్ పేరు తీసుకోకుండానే హరీష్ మాటల పర్వం సాగడం గమనార్హం. సమావేశంలో మాట్లాడిన సమయంలో హరీష్ రావు.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అన్నారు తప్ప రేవంత్ రెడ్డి పేరు పలకలేదు.
తెలంగాణ భవన్ లో జరిగిన జాయినింగ్స్ సభలో హరీష్ రావు ఏం మాట్లాడారో కింద చదవండి.
తెలంగాణ సాధకులకు….తెలంగాణ ద్రోహులకు మధ్య రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయి. ఒక్క దెబ్బతో నాలుగు పార్టీలకు బుద్ధి చెబుదాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ మాట్లాడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ కు అన్యాయం చేసారు. తెలంగాణ వివక్షకు కారణం కాంగ్రెస్. తెలంగాణా కు అడ్డం పార్టీ టిడిపి.
కొడంగల్ కు పాలమూరు పథకం ద్వారా నీళ్లు తీసుకువస్తాం. మహబూబ్ నగర్ కు అన్యాయం చేసింది చంద్రబాబు. ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డం పడుతున్నాడు. కోదండరామ్ కు రైతుల ఉసురు తప్పక తగులుతుంది. కోదండరాం సర్వశక్తులు ఒడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసాడు.
వచ్చే ఎన్నికల్లో దిమ్మ తిరిగే తీర్పు కొడంగల్ లో ఇవ్వాలి. కొడంగల్ లో మొన్నటి దాకా ఉన్న ఎమ్మెల్యేకు మాటలు ఎక్కువ….చేతలు తక్కువ. నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.