ఏ మాటకామాటే చెప్పుకోవాలి. టిఆర్ ఎస్ రాజకీయ వ్యూహాల గురించి మాట్లాడితే రెండు పేర్లే చెప్పుకోవాలి. ఒకటి కెసియార్, ఆపైన హరీష్ రావు. దీనికి కారణమేమీ లేదు. హరీష్ రావు టిఆర్ ఎస్ పుట్టుకలోనే కీలక పాత్ర వహించారు. టిఆర్ ఎస్ ఆలోచన వెనక కెసియార్ ఉంటే దానికి బయటి నుంచి అన్ని రకాల మద్దతు కూడగట్టింది హరీష్ రావే. కెసియార్ చేసే అన్ని రకాల పనులు, బహిరంగ కార్యక్ర మాలు, వ్యూహాత్మక సీక్రెట్ కార్యక్రమాలన్నీ కూడా హరీష్ రావు తోనే నడిచేవి. అందుకే టిఆర్ ఎస్ లో హరీష్ కు తెలియని రహస్యంలేదు, తెలియని వ్యక్తి లేడు. తెలియని వ్యూహం లేదు. టిఆర్ ఎస్ తో పాటు, టిఆర్ ఎస్ ప్రత్యర్థుల బలాలు బలహీనతలు హరీష్ కు బాగా తెలుసు. మరొక విషయమేమిటంటే, కెసియార్ మేనల్లుడు కావడమే హరీష్ క్వాలిఫికేషన్ అని ఎవరూ అనంగా వినలేదు. ఆ మచ్చ ఆయనకు అంటుకోనేలేదు. అంటే హరీష్ టాలెంట్ ను రాజకీయ సమాజం గుర్తించింది. ప్రజలు గుర్తించారు. అందుకే హరీష్ అంటే సర్వత్రా మంచి అభిప్రాయం ఉంది. ఇలాంటి సకల జనుల కితాబు దొరకడం అరుదు.
అందుకే కెసియార్ ఇపుడు హరీష్ నెత్తిమీద కొండంత బాధ్యత పెట్టారు. నువ్వు మోయాల్సిందే అంటున్నారు.ఇలా అనడంతో, బయట ఎన్ని పుకార్లున్నా, కెసియార్ కు హరీష్ ఎంత అవసరమో, టిఆర్ ఎస్ లో హరీష్ రావు అంటే ఏమిటో అర్థమవుతుంది.
ఇపుడు రాష్ట్రంలో కెసియార్ కు అయిదారుగురు ప్రధాన శత్రువులున్నారు. వాళ్లలో కూడా ఒక ఇద్దరు అంటే కెసియర్ ఏ మాత్రం గిట్టదు. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా కెసియార్ కు ఫరక్ పడదు. కాని ఆయిద్దరు ఓడిపోవాలి. వాళ్లిద్దరు అసెంబ్లీలో కనిపించడానికి వీల్లేదు. ఒక దెబ్బతో వాళ్లిద్దరిని ఫసక్ చేయమని ఆయన హరీష్ రావుకు బాధ్యత అప్పగించారు. అయిద్దరు ఎవరో తెలుసా? ఒకరు కోడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రెవంత్ రెడ్డి, మరొకరు గద్వాల్ మాడ్రన్ మహారాణి డికె అరుణ.
కాంగ్రెస్ లో కెసియార్ మీద దాడి చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కెసియార్ చేసే విమర్శలకు పొల్లుపోకుండా కౌంటర్ చేసే వాళ్లున్నారు. అదొక ఎత్తు. రేవంత్, అరుణలు మరొక ఎత్తు. కెసియార్ మాటకు మాట, తిట్టుకుతిట్టు, ఆరోపణకు ఆరోపణ… కెసియార్ లాగే స్పష్టంగా, అందరికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పడమే కాదు, పులిలా గాండ్రించగలరు. అందుకే కెసియార్ కు వాళ్లిద్దరి మీద డబుల్ కసి. వాళ్లిద్దరిలాగా కెసియార్ కుటుంబం మీద దాడి చేసే వాళ్లెవరూ ప్రతిపక్షంలో లేరు. బిసి నేతలు కెసియార్ మీద పెద్దగా దాడి చేయలేరు. ఎస్ సి నేతలు కూడా కెసియార్ కుటుంబ జోలికి వెళ్లడానికి జంకుతారు. ఒక వేళ ఈ కులాల వాళ్లు ఏమన్నా కెసియార్ పెద్ద పెద్దగా పట్టించుకోరు. దొర గా పేరున్న వెలమ కెసియార్ ను ఢీ కొనాలంటే లోలోన ఈ కులాలలో రాజకీయ భీతి ఉంటుంది. అయితే, రెడ్డి కులానికి చెందిన రేవంత్, డికె అరుణ సమఉజ్జీలు. వాళ్లు మాట్లాడితే ఎక్కడ తగలాలలో అక్కడ తగులుతాయి. కెసియార్ కు తగులుతున్నాయి కూడా . తెలంగాణాలో కెసియార్ కు నిజమయిన మ్యాచ్ రేవంత్ అని అంతా గుర్తించారు. ఇక అరుణ ఏమాత్రం తీసిపోదు. బహుశా, అరుణ లాగా కెసియార్ కు ఇంతవరకు ఏ మహిళా సవా ల్ విసిరి ఉండదు.
అందుకే ఈ రేవంత్, అరుణ నోళ్లు మూయించాలి. ఆ పనిని ఆయన టిఆర్ ఎస్ లో మేటి వ్యూహకర్త, మాటలలో చేతలలో ఎవరికీ తీసిపోని యువతరం ప్రతినిధి హరీష్ రావుకు అప్పగించారు. దీనితో హరీష్ రావుకు చేతినిండా పని పడింది. ఆయన సిద్ధిపేటలో తాను గెలివాలి. గజ్వేల్ లో మామ కెసియార్ ను రికార్డు ఓట్లతో గెలిపించాలి. అంతేకాదు, రేవంత్ రెడ్డి, డికె అరుణవచ్చే అసెంబ్లీలో కనిపించకుండా చేయాలి.
ఈ ఇంత బాధ్యతలను అప్పగించడం హరీష్ రావు కు చాలా పెద్డ గౌరవం ఇవ్వడమే. అయితే, అదే సమయంలో అదొక విషమ పరీక్ష కూడా.