రేవంత్ రెడ్డి అరెస్టులో బదిలీ అయిన ఎస్పీకి మళ్లీ పోస్టింగ్

ఎన్నికల ముందు కొడంగల్ లో కేసిఆర్ సభ సందర్భంగా ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ 3 గంటల సమయంలో పోలీసులు ఇంటి తలుపులు బద్ధలుకొట్టి మరీ అరెస్టు చేశారు. కొడంగల్ లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ క్యాంపులో ఉంచారు. అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ లెక్క ప్రకారం అరెస్టు చేశారు? అర్థరాత్రి అరెస్టు చేయడానికి కారణాలేంటి అని హైకోర్టు సర్కారు తీరును ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తున్నది.

అయితే ఈ కేసులో ఎన్నికల కమిషన్ సిఇఓ రజత్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణను డిజిపి బదిలీ చేశారు. ఆమెను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని ఎస్పీగా నియమించారు. అయితే ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అన్నపూర్ణకు తిరిగి వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు కల్పించింది తెలంగాణ సర్కారు. ఆమె శనివారం వికారాబాద్ ఎస్పీగా బాధ్యలు స్వీకరించారు కూడా.

అన్నపూర్ణ, వికారాబాద్ ఎస్పీ

ఒకవైపు కోర్టులో రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో కేసు నడుస్తుండగానే పర్భుత్వం తిరిగి ఎస్పీని అక్కడకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? అర్ధరాత్రి అరెస్టు చేయకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరా? అని కోర్టు తెలంగాణ సర్కారును ప్రశ్నించింది. ఏరకమైన రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఉత్తుత్తి కాగితాల మీద ఆర్డర్స్ వేసి అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించింది. డిజిపి మహేందర్ రెడ్డిని తమ ఎదుటు హాజరుకావాలని ఆదేశించింది. తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేయడంతో డిజిపి మహేందర్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు వివరణ ఇచ్చారు.

 

తాజాగా కోర్టులో కేసు ఉండగానే టిఆర్ఎస్ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుని ఎస్పీని తిరిగి వికారాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చింది. మరి ఈ కేసుపై కోర్టులో ఏరకమైన తీర్పు వస్తుందోనని రేవంత్ రెడ్డి వర్గం ఎదురుచూస్తున్నారు.