లక్షలు పోసి కొనే కార్లు కొంతకాలానికే పాడవుతు ఉంటాయి. సరైన మెయింటెన్స్ లేకపోవడం వల్ల తరచూ కార్ రిపేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో కార్ స్టార్ట్ చేసిన కొంతసేపటికి ఇంజన్ పూర్తిగా హీట్ అవుతూ ఉంటుంది. ఇలా కార్ ఇంజన్ హీట్ అవ్వడం వల్ల మైలేజ్ తగ్గడం, కారు ఇంజిన్ ఆగిపోతుండటం, పదే పదే ఇంజిన్ సౌండ్ ఎక్కువగా రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కార్ ఇంజన్ హీట్ అవ్వకుండా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కార్ ఇంజన్ హీట్ అవ్వకుండా పాటించాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా కారు ఇంజిన్ ఓవర్ హీట్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కారు నడపటం వల్ల కారు ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. అలాగే ఎక్కువసేపు కారుని ఆపకుండా నిరంతరంగా నడపడం వల్ల కూడా ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇలా కార్ ఇంజన్ హీట్ అవ్వకుండా ఉండటానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కారులో ప్రయాణించేటప్పుడు కొంత సమయం పాటు కారుని నీడలో ఆపి ఉంచాలి. అలాగే కారు ఇంజిన్ నడుస్తున్నప్పుడు రేడియేటర్ క్యాప్‌ను పొరపాటున కూడా తెరవకూడదు. ఎందుకంటే ఇంజిన్ కూల్ చేయడంలో రేడియటర్ కీలక పాత్ర పోషిస్తుంది.
రేడియేటర్‌లో శీతలకరణి నిండి ఉంటుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూలెంట్ కూడా చాలా వేడిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రేడియేటర్ క్యాప్ తెరిస్తే,అది మీపై పడి చర్మాన్ని కాల్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కారులోని అన్ని భాగాలు సక్రమంగా ఉన్నా కూడా కూలెంట్ లీక్ అవటం వల్ల ఇంజన్ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఇక కూలెంట్ కూడా సరిగా ఉంటే రేడియేటర్ లో లీకేజ్ ఉండటం వల్ల కూడా ఇంజన్ ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కూలెంట్ లీకవటం, రేడియేటర్ లీక్ అవ్వటం వంటి సమస్యలను గమనిస్తే వెంటనే మెకానిక్ ని సంప్రదించటం మంచిది లేదంటే కారు ఇంజన్ పూర్తిగా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.