దీపావళి పండుగ రోజున చేసే ప్రత్యేక వంటకాలు.. వాటి తయారీ విధానం మీకోసం..?

ప్రజలందరూ ఎంతో ఇష్టపడే పండుగ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పువ్వులతో రంగురంగుల ముగ్గులతో అలంకరించి దీపాలు వెలిగిస్తారు. అలాగే పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగ రోజున లక్ష్మీ పూజలో అమ్మవారికి ఇష్టమైన మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం పొంది సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.

దీపావళి పండుగ రోజున తయారు చేసే ప్రత్యేక పిండి వంటకాలు వాటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

1. తీపి భుచక్రాలు:

కావాల్సిన పదార్థాలు
మైదా- 1 కప్పు
చక్కెర- ఒకటిన్నర కప్పు
పాలు- కప్పు
కుంకుమ పువ్వు- చిటికెడు
డ్రైఫ్రూట్స్- కొద్దిగా
నూనె లేదా నెయ్యి- వేయించడానికి తగినంత
తయారీ విధానం:
ముందుగా మైదా పిండి తీసుకుని చిటికెడు ఉప్పు, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి ముద్దలా చేయాలి. ఈ పిండి అరగంట నానిన తర్వాత చపాతీ పిండిని పూరీలా వత్తి చుట్టాలి . మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కొద్దిగా పిండి వేసి, తర్వాత దీన్ని చాకుతో చిన్న చిన్న భాగాలు చేసి, భూచక్రాల ఆకారంలో వత్తుకోవాలి. తర్వాత నెయ్యి లేదా నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి రెండు గంటల ముందు పాలలో పంచదార, కుంకుమ పువ్వు వేసి ఓ పక్కన ఉంచుకోవాలి. పాలను వేడిచేసి వేయించిన భూచక్రాలను అందులో వేయాలి. అంతే రుచికరమైన భూచక్రాలు రెడీ.

2. చిమ్మిలి పూర్ణాలు :
కావాల్సిన పదార్థాలు
నువ్వులు- కప్పు
బియ్యపు పిండి- కప్పు
బెల్లం- కప్పు
మైదా- టీస్పూన్
ఉప్పు- చిటికెడు

తయారీ విధానం: ముందుగా బియ్యపు పిండిలో మైదా, చిటికెడు ఉప్పువేసి నీళ్లుపోస్తూ చిక్కగా కలుపుకోవాలి. దీన్ని పావుగంటసేపు నాననివ్వాలి. తర్వాత స్టౌ వెలిగించి, కళాయి పెట్టి అందులో నువ్వులు వేయించాలి. చల్లారాక మిక్సీ పట్టించాలి. తర్వాత ఇందులో బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టించి, గిన్నెలో వేయాలి. తర్వాత చిమ్మిలిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని, బాణలిలో నూనె వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా సిద్దం చేసుకున్న పూర్ణం పిండిలో ముంచి వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన చిమ్మిలి పూర్ణాలు తయారవుతాయి.