విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల వేళ అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపిక వ్యవహారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. శనివారం మధ్యాహ్నం విజయవాడలో అభ్యర్థుల ఎంపికపై జరిగిన ఒక కీలక సమావేశంలో ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, ఇద్దరూ అరుచుకుంటూ మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం బెజవాడ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
ఈ వివాదం కేవలం ఒక మీటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు చాలా తీవ్రంగానే ఉన్నాయని క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో ఎంపీ కేశినేని చిన్ని మాటకు అసలు విలువ లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. “తన నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ సీటు ఇవ్వాలో తనకు తెలుసని, తన వారికే ప్రాధాన్యత ఇస్తానని” బొండా ఉమా గట్టిగా పట్టుబట్టడం చూస్తుంటే, నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలకే పూర్తి పట్టు ఉందని, ఎంపీ జోక్యాన్ని వారు ఏమాత్రం సహించడం లేదని అర్థమవుతోంది.
మరోవైపు, ఈ అంతర్గత పోరులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఎంపీ విషయంలో అంత సానుకూలంగా లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులు వేరని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదే కాబట్టి, అధిష్టానం కూడా బొండా ఉమా వంటి సీనియర్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఒత్తిడి తెచ్చినప్పటికీ, అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలదే అంతిమ నిర్ణయం అనే సంకేతాలు ఇవ్వడం కేశినేని చిన్ని వర్గానికి మింగుడుపడటం లేదు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్ అంతిమంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.