చింతమనేనికి షాక్ ఇచ్చిన చంద్రబాబు..?

ఏలూరు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు టీడీపీ అధిష్టానం దాదాపు తెరదించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ, గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబానికే ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి దక్కబోతోందని సమాచారం. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి, క్లారిటీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా మాగంటి బాబు కుటుంబం వ్యక్తిగతంగా, రాజకీయంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశించినప్పటికీ, కూటమి సమీకరణాల్లో భాగంగా పుట్టా మహేష్ కుమార్‌కు సీటు దక్కింది. అయినప్పటికీ, మాగంటి బాబు మనస్తాపానికి గురికాకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. అలాగే ఇద్దరు కొడుకులు చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఆయన కుటుంబంపై సానుభూతి పెంచింది.

ఈ నేపథ్యంలో, ఆ కుటుంబం పట్ల ఉన్న సానుభూతి, పార్టీ పట్ల వారికున్న విధేయతను గుర్తించిన చంద్రబాబు.. మాగంటి బాబు సతీమణి మాగంటి పద్మావల్లి దేవి గారికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని నిశ్చయించినట్లు భోగట్టా. సీనియర్ నేతకు సముచిత గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పీఠం కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె సాయి నవ్యశ్రీని బరిలోకి దించేందుకు భారీ వ్యూహమే రచించారు.

నవ్యశ్రీ కూడా ఇటీవల ఏలూరులో తన నామినేషన్ వేసి, ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. అయితే, చింతమనేని కుమార్తెకు రాజకీయంగా ఇదే తొలి అడుగు కావడం, ఆమె వయసు చాలా చిన్నది కావడం ఆమెకు మైనస్ పాయింట్లుగా మారాయని టాక్. జిల్లా పరిషత్ వంటి పెద్ద బాధ్యతను మోయడానికి రాజకీయ అనుభవం అవసరమని భావించిన అధిష్టానం.. నవ్యశ్రీకి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని భరోసా ఇస్తూనే, ప్రస్తుతానికి ఆమెకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో తన కుమార్తెను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని ఆశించిన చింతమనేని ప్రభాకర్‌కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించారు. ఒకే కుటుంబానికి రెండు కీలక పదవులు ఇస్తే మిగిలిన నేతల్లో అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉంది. మరోవైపు, సీనియర్ అయిన మాగంటి బాబును పక్కన పెడితే పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనా కూడా ఉంది. అందుకే, బాలెన్సింగ్ పాలిటిక్స్‌లో భాగంగా చంద్రబాబు.. సానుభూతి కార్డుతో పాటు సీనియారిటీ ఉన్న మాగంటి కుటుంబానికే మొగ్గు చూపారు. ఈ నిర్ణయంతో ఏలూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలకు చెక్ పడటంతో పాటు, క్యాడర్‌లో పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయని టీడీపీ భావిస్తోంది.