నెల్లూరు టీడీపీలో రచ్చ.. బీ-ఫామ్ పంపిణీలో విభేదాలు..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ హైడ్రామా చోటుచేసుకుంది. జడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన అధికారిక బీ-ఫామ్‌ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పార్టీ వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు, టిక్కెట్ల పంపిణీ వ్యూహాలపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కార్యాలయం సాక్షిగానే బీద రవిచంద్రపై మంత్రి ఆనం కోపంతో ఊగిపోవడం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ స్థానాల వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న అసలైన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన చెందారు. గత ఐదేళ్లుగా పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన కొందరు వ్యక్తులకు, ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఎలా రానిస్తారంటూ బీద రవిచంద్రను ఆనం నిలదీశారు. పార్టీ అధికారికంగా నిర్ణయించిన అభ్యర్థులను పక్కనబెట్టి, మరొకరికి బీ-ఫామ్ ఎలా కేటాయిస్తారంటూ ఆయన నిప్పులు చెరిగారు.

ఇదే తరుణంలో జిల్లాలో సొంత పార్టీ శ్రేణులే చేస్తున్న లోపాయికారీ రాజకీయాలపై మంత్రి ఆనం సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రెబల్స్ అభ్యర్థులను కొందరు కావాలనే వెనకుండి ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత లాభాల కోసం కొందరు నేతలు రెబల్స్ అభ్యర్థులకు భారీగా డబ్బులు ఇచ్చి మరీ నామినేషన్లు వేయించారని, కూటమి అధికారిక అభ్యర్థులను ఓడించేందుకు తెరవెనుక సపోర్టు చేస్తున్నారని మంత్రి ఆనం ఫైర్ అయ్యారు. స్థానిక పోరు క్లైమాక్స్‌కు చేరిన వేళ.. ఒకవైపు మంత్రి ఆనం, మరోవైపు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వర్గాల నడుమ తలెత్తిన ఈ అంతర్గత ముసలం నెల్లూరు కూటమి రాజకీయాలను కుదిపేస్తోంది.