చిక్కుల్లో పడ్డ పృథ్వీరాజ్.. భార్యకు భరణం నెలకు లక్షల్లో!

పృథ్వీరాజ్ ఒక తెలుగు సినిమా నటుడు. ఇతను ఎక్కువగా హాస్యపాత్రలను.. కొన్ని ప్రతినాయక పాత్రలను పోషించాడు. ఇతను దాదాపు 80 కి పైగా చిత్రాలలో నటించాడు. 1993లో ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో ఇతను చెప్పిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ఇతని కెరియర్ నే మలుపు తిప్పింది. గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యం చిత్రంలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా ఇతనికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇలా వరుస అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు.. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

ఇతను సినిమాలలోనే కాక బుల్లితెరలో రెండు రెళ్ళు ఆరు అనే సీరియల్ లో కూడా నటించడం జరిగింది. ఇక కెరియర్లో ప్రముఖ హాస్య నటులలో ఒకరిగా రాణిస్తున్న పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే..

నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి 1984లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై కి సినిమాలలో నటించడానికి ప్రయత్నించేవాడని.. ఇతనికి సంబంధించిన అన్ని ఖర్చులు తన పుట్టిల్లు వాళ్లే ఖర్చు చేశారని తెలిపింది శ్రీలక్ష్మి.

ఇక తనను తరచూ వేధించేవాడని 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి గెంటేశాడని తెలిపింది. ఇక పృథ్వీరాజ్ సినిమాలు.. సీరియల్ ల ద్వారా నెలకు దాదాపు 30 లక్షల పైనే సంపాదిస్తున్నాడని, ఇతని నుంచి భరణం ఇప్పించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

అన్ని పరిశీలించిన కోర్టు పృథ్వీరాజ్, శ్రీలక్ష్మికి ప్రతి నెల 8 లక్షలు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ప్రతినెల 10వ తేదీ లోపు కచ్చితంగా చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పడం జరిగింది.