కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించాడు. 1942లో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి నాటకాలు అంటే చాలా ఆసక్తి. మొదట స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. 1968 లో రుక్మిణి తో వివాహం జరిగింది. ఈయనకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం.
ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొకవైపు నాటకాలలో నటించేవాడు. అలా నటిస్తున్న సమయంలో 1978లో ఆయన నటించిన ప్రాణం ఖరీదు నాటకాన్ని చూసిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఈ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. ఈ నాటకాన్ని సినిమాగా ఇందులోని నటులనే తీసుకోవడం ద్వారా కోట శ్రీనివాసరావు గారు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎప్పుడూ ఆయన సినిమాలలోకి రావాలి అని అనుకోలేదు.
తరువాత ఆహనా పెళ్ళంట సినిమాలో హీరోయిన్ తండ్రిగా పిసినిగొట్టు పాత్రలో నటించి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత వరుసగా సినీ అవకాశాలతో ముందుకు సాగిపోయాడు. దాదాపు 750 కి పైగా చిత్రాలలో నటించడం జరిగింది. విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా వంటి వివిధ పాత్రలలో నటించింది గాను 9 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు. కృష్ణం వందే జగద్గురు సినిమా ద్వారా SIIMA అవార్డును పొందారు.
2015లో అతను భారతీయ సినిమాకు చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. ఇక 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా గెలిచి సేవలు చేశారు. ఇక ఈయన జీవితంలో తీరని విషాదం 2010లో కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం. ఉన్న ఒక్కగానొక కొడుకు కళ్ళముందే చనిపోతే ఆ బాధను తీర్చడం, ఆ కన్నీళ్లను ఆపడం ఎవరి సాధ్యం కాదు.
తన కుమారుడు తనతో సిద్ధమ్, గాయం 2 అనే చిత్రాలలో కలిసి నటించాడు. ఆ తరువాత ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు మరో జన్మ అంటూ ఉంటే ఇలాంటి జీవితమే ఇచ్చి కాస్త కష్టాలు తక్కువగా ఉండాలని, నీతి, నిజాయితీలు ఉండేలా ఆ దేవున్ని కోరుకుంటాను అని తెలుపడం జరిగింది.