ఓవైపు అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం..మరోవైపు టీడీపీ నేతల అరెస్ట్ లు..ఇంకొక వైపు ఎంపీ రఘురామ కృష్ణమరాజు వ్యవరహారంతో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైకాపా మంత్రి, కృష్ణాజిల్లా వైకాపా నేత పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. భాస్కరరావు మున్సిపల్ చేపల మార్కెట్ లో ఉండగా దుండగుల అతన్ని కత్తితో పొడిచి పరారయ్యారు. గాయపడిన భాస్కరరావు ని అతని సిబ్బంది, స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భాస్కరరావు కన్ను మూసారు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు.
గాయం గుండెకు కూడా అవ్వడంతో ఆరోగ్యం విషయమించిందని డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ హత్యలో మొత్తం నలుగురు పాల్గొన్నట్లు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా గుర్తించారు. భాస్కరరావుని పొడిచిన వ్యక్తి కోసం మరో వ్యక్తి రోడ్డుపై బైక్ తో సిద్దంగా ఉన్నాడు. కత్తితో పొడిచిన అనంతరం అక్కడ నుంచి బైక్ పై పరారయ్యారు. చిన్ని అనే వ్యక్తిని ఈ హత్యకు కారకుడిగా పోలీసులు గుర్తిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఈఘటనపై మంత్రి పోలీసుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. నిందుతులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని..కఠినంగా శిక్షించాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది.
భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యాడ్ చైర్మన్ గా పనిచేసారు. భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో మచిలీపట్నం భయాందోళనకు గురవుతోంది. పట్టపగలు అధికార పార్టీ అనుచరుడిని చంపేంత ధైర్యం ఎవరు చేసారు? అన్నది రాజకీయ పార్టీ సహా, ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది.