చిరంజీవికి ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఇవ్వబోతోందా.?

మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ, కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. అయితే, అప్పట్లో ఆ ప్రతిపాదనను చిరంజీవి తిరస్కరించారంటూ వార్తలొచ్చాయి. మొన్నీమధ్యన ఇంకోసారి, చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు బీజేపీతోపాటు, వైసీపీ కూడా ప్రయత్నించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ, అవి కూడా ఉత్త పుకార్లుగానే మిగిలిపోయాయి.

ఇంతకీ, రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ విషయమై చిరంజీవి ఏమనుకుంటున్నారు.? ఒకవేళ బీజేపీ నేరుగా చిరంజీవికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేస్తే.? నిజానికి, చిరంజీవి ‘నో’ చెప్పడానికి వీల్లేని ఆఫర్ ఇది. కానీ, చిరంజీవి అందుకు సమ్మతించకపోవచ్చన్నది ఆయన అంతరంగం గురించి తెలిసిన చాలామంది చెబుతున్నమాట.

ముఖ్యమంత్రి చిరంజీవి.. అనే గుర్తింపు కంటే కూడా, మెగాస్టార్ చిరంజీవి అనే గుర్తింపు చాలా చాలా పెద్దది. ఒక్కసారి చిరంజీవి జనంలోకి వెళితే, ఆయన మీద కురిసే అభిమానం.. ముఖ్యమంత్రి కాదు కదా, ప్రధాన మంత్రికి సైతం వుండదన్నది జగమెరిగిన సత్యం.

చిరంజీవి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు జనంతో జేజేలు పలికించుకోవడానికి. కానీ, రాజకీయాల్లో చాలా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దాన్ని అమ్మేసుకున్నారని ఆరోపించే చాలామంది రాజకీయ నాయకులు, ఈ రోజు చిరంజీవిని ‘అందరివాడు’ అంటున్నారు. అదే రాజకీయాల్లో వున్న తేడా.

ప్రజలు ఏం ఆలోచిస్తుంటారో, ఎలా రాజకీయ నాయకుల్ని అర్థం చేసుకుంటారో చిరంజీవికి తెలుసు. అందుకే, చిరంజీవి తనకు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఒకవేళ ఆఫర్ చేసినా తీసుకునే అవకాశం లేదు. అసలు, చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసేంత సీన్ కూడా బీజేపీకి లేదిప్పుడు.