ఎవరైనా మంచి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద రాళ్లు వేయడానికి ఎప్పుడూ కొంతమంది సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్లే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. విషయం ఏమిటంటే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు నిన్న కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను పంపారు. ఆ ఆక్సిజన్ సిలిండర్ల మీద చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని రాసి ఉంది. ఇదే ఇప్పుడు పెద్ద విషయమైపోయింది.
అలా పేరు రాయడం తప్పని, అది ప్రచారం కోసం చేస్తున్న పనేనని అంటున్నారు. అసలు చిరంజీవికి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది విమర్శలు చేస్తున్న వ్యక్తులు గమనించాల్సిన విషయం. ఇక చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరంజీవి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నవి. కాబట్టి ఆ ఫౌండేషన్ పేరును సిలిండర్ల మీద రాయడంలో తప్పేం లేదు. చారిటబుల్ ట్రస్ట్ అన్నాక ఏం చేస్తుందో జనాలకు తెలియడం అవసరం. అయినా ప్రజల సొమ్ముతో నడిచే పథకాలకు తమ పేర్లు, తండ్రుల, తాతల పేర్లు పెట్టుకుని ఏదో జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నామన్నట్టు మహానుభావుల్లా కలరింగ్ ఇచ్చే పొలిటీషియన్లకు పాలాభిషేకాలు చేసే జనం చిరంజీవి తన ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకు ట్రస్ట్ పేరు వేసుకుంటే తప్పుబట్టడం అనేది వారి అవివేకం కాక ఇంకేం అవుతుంది.