కొన్ని విషయాలను రాజకీయం చేయకూడదు. కాలం చేసిన వ్యక్తుల విషయాలను అస్సలు చేయకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ కొని రోజుకు క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన్ను ఇష్టపడేవారు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఆయన మరణానికి సంతాపం తెలిపారు. ఆయనంటే గిట్టని వారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బయటపెట్టారు. ఇదంతా పబ్లిక్ ఒపీనియన్. దాన్ని ఎవ్వరూ కాదనలేరు, ఆపలేరు. కానీ సెలబ్రిటీల విషయంలో అలా కాదు. వారు కూడ సామాన్యుల్లా స్పందిస్తే పర్యవసానాలు వేరేలా ఉంటాయి.
కత్తి మహేష్ మరణం పట్ల కొందరు సినీ జనం తన సంతాపాన్ని తెలపగా కొందరు స్పందించలేదు. స్పందించని అందరినీ వదిలేసి మెగా ఫ్యామిలీ మీద పడ్డారు ఇక వర్గం వారు. ఈమధ్య ప్రతి విషయానికి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కానీ కత్తి మహేష్ మరణం విషయంలో మాత్రం నోరు సైలెంట్ అయ్యారు. అది ఆయన వ్యక్తిగతం. తప్పుగా స్పందిస్తే తప్పుబట్టాలి కానీ అసలు ఏ గొడవా లేకుండా ఊరుకుంటే వేలెత్తి చూపాల్సిన పనే లేదు. కానీ ఇదే జరుగుతోంది. చిరంజీవి తాను స్పందిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతారనే భయంతోనే స్పందించలేదని అంటున్నారు. నిజమే.. పవన్ అభిమానులకు కత్తి మహేష్ అంటే గిట్టదు. ఎందుకంటే గతంలో జరిగిన వివాదాలు అలాంటివి.
అయినా కూడ కత్తి మహేష్ మరణం పట్ల సానుభూతి తెలిపినవారు లేకపోలేదు. ఇక చిరంజీవి విషయానికే వస్తే గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద ఆయన అభిమానుల మీద విమర్శలు చేసినప్పుడు వివాదాలు రేగినప్పుడు మాట కూడ మాట్లాడలేదు. చాలా హుందాగా నడుచుకున్నారు. అప్పుడు చిరంజీవి స్పందించి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇప్పుడు కూడ చిరంజీవి చేసింది అదే. అప్పుడేలా మౌనం వహించారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇందులో ఆయన్ను తప్పుబట్టాల్సిన పనే లేదు. అసలు కత్తి మహేష్ మరణాన్ని ఇంత రాజాకీయం చేయాల్సిన అవసరమే లేదు.