RGV Aparichithudu : నటుడు నాని ఎవరో నాకు తెలియదు.. నాకు తెలిసిన నాని అంటే కొడాలి నాని మాత్రమే.. పేర్ని నాని కూడా తెలుసు.. అంటూ కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు. చాన్నాళ్ళ క్రితం అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పి వివాదాల్లోకెక్కారు.
తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల, కేటీయార్ ఎవరు.? అంటూ సెటైర్ వేసిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఇదంతా రాజకీయ ‘అపరిచిత’ మనస్తత్వం.. అంతకు మించి ఇంకేమీ కాదు.
తాజాగా, రామ్ గోపాల్ వర్మ కూడా అపరిచితుడు అవతారమెత్తారు. తనకు కొడాలి నాని ఎవరో తెలియదనీ, నటుడు నాని మాత్రమే తెలుసంటూ ట్విట్టర్ ద్వారా సెటైర్ వేసేశారు. అనిల్ కుమార్ యాదవ్‌కి నటుడు నాని తెలియకపోవడమేంటి.? షర్మిలకి కేటీయార్ ఎవరో తెలియకపోవడమేంటి.? ఆర్జీవీకి కొడాలి నాని ఎవరో తెలియకపోవడమేంటి.? తెలియక కాదు, తెలియనట్టు జస్ట్ నటిస్తూ సెటైర్లేస్తారంతే.
ఏదో గొప్ప సెటైర్ వేసేశామని వీళ్ళంతా అనుకోవచ్చుగానీ, జనంలో నవ్వులపాలైపోతుంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా. సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సెటైర్లని. రాజకీయాల్లో కూడా ఈ తరహా సెటైర్లు పడుతుండడం హాస్యాస్పదమే.
పైగా, బాధ్యతగల పదవుల్లో వున్నవాళ్ళు మీడియా ముందు ఇలాంటి సెటైర్లేయడం అత్యంత హేయం.. అనే అభిప్రాయం వుండనే వుంది. సినిమా టిక్కెట్ల అంశంపై రచ్చ జరుగుతున్న సమయంలో మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని ఆర్జీవీ చెప్పడం మేధావితనం కాదు, మూర్ఖత్వమంతే.!