అవినీతికి పాల్పడి.. నానా అడ్డదారులూ తొక్కి.. విసారె పవర్ పంచ్.!

Vijayasai Reddy

Vijayasai Reddy

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీటేశారు.. అదీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు గురించి. చంద్రబాబు పేరు చెబితే చాలు, విజయసాయిరెడ్డి ట్వీట్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటుంది. ‘అవినీతికి పాల్పడి.. నానా అడ్డదారులు తొక్క బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రబం..’ అంటూ విసారె తన ట్వీట్ ద్వారా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘చట్టం ముందు నిలబడే దమ్ముందా అసలు.? సిగ్గు లేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నం. ప్రజా కోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యేగానూ నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలు అయిపోతుంది..’ అంటూ విసారె మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా. అయితే, ఇక్కడ ఈ విజయసాయిరెడ్డి ట్వీటుని టీడీపీ మద్దతుదారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, విజయసాయిరెడ్డికీ అన్వయించి తమకు తోచిన రీతిలో అర్థాలు తీస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ మీద వున్నారనీ.. అలాంటోళ్ళు చట్టాలు, శిక్షల గురించి మాట్లాడటమేంటన్నది తెలుగు తమ్ముళ్ళ ఆరోపణ. బహుశా విజయసాయిరెడ్డి పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కించపర్చుతున్నారేమోనంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ నుంచి ట్వీటానుమానాలు తలెత్తుతున్నాయి. ‘ప్రతి శుక్రవారం మీరు కోర్టు యెదుట విచారణకు హాజరు కావాలి. దాన్నుంచి తప్పించుకోవడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. అది మానేసి, ముందు మీరు విచారణకు హాజరవ్వండి. బెయిల్ రద్దు చేసుకుని, విచారణ వేగవంతమయ్యేందుకు సహకరిస్తే, మీ సంగతేంటో తేలిపోతుంది..’ అని టీడీపీ నాయకులు బాహాటంగానే విజయసాయిరెడ్డికీ, వైఎస్ జగన్‌కీ సవాల్ విసురుతున్నారు. అయితే, అసలంటూ విచారణే జరగకుండా జాగ్రత్తపడుతున్న చంద్రబాబుకీ, విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ నక్కకీ నాకలోకానికీ వున్నంత తేడా వుందన్నది వైసీపీ మద్దతుదారుల వాదన.