Venkatesh: విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాల్లో ‘దృశ్యం 2’ కూడ ఒకటి. ఇటీవలే విడుదలై మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన మోహన్ లాల్ ‘దృశ్యం 2’కు ఇది రీమేక్. వెంకీ దీని ప్రీక్వెల్ ‘దృశ్యం’ను కూడ రీమేక్ చేశారు. ఇక మోహన్ లాల్ లాంటి అగ్ర హీరో నటించారు అంటే మలయాళంలో అది చాలా పెద్ద సినిమా.
అంత పెద్ద సినిమా అయినప్పటికీ దాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. థియేటర్లు పూర్తిగా తెరుచుకోకపోవడం మూలానే మోహన్ లాల్ లాంటి స్టార్ కూడ ఓటీటీ వైపుకు వెళ్లాల్సి వచ్చింది. సినిమా ఫలితం విషయానికి వస్తే నిర్మాత లాభపడ్డారు. సినిమాకు మంచి పేరొచ్చింది.
అయితే తెలుగులో మాత్రం ఓటీటీలో వదిలే ఉద్దేశ్యంలో లేరు టీమ్. మలయాళం వెర్షన్ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ కూడ చేస్తున్నారు. కేవలం 47 రోజుల్లోనే షూటింగ్ ముగించేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. టికెట్ ధరలు తగ్గాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి ఆపత్కర సమయంలో కూడ ‘దృశ్యం 2’ను థియేటర్లోనే రిలీజ్ చేస్తామని సురేష్ బాబు అంటున్నారు. థియేటర్లలో వచ్చాకనే ఓటీటీలకు ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు.