ఉపాసన కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడ నిర్వర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం విశేషమైన కృషి చేశారామె. ఆమెలోని ఈ సామాజిక స్పృహను గమనించే వర్కడ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా ఆమెకు కీలకమైన బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫారెస్ట్, ఫ్రంట్ లైన్ హీరోస్ బాధ్యతలను అప్పగించింది. కరోనా కష్ట కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఎన్నో ప్రాణాలను కాపాడారు.
అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడ నిత్యం ఇలాగే అనేక ప్రమాదాల నడుమ పనిచేస్తూ వైల్డ్ లైఫ్ భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నారు. అతి తక్కువ సౌకర్యాల నడుమ అడవుల్లో కౄర జంతువుల మధ్యన తిరుగుతూ పనిచేస్తుంటారు. ప్రతిరోజూ 15 నుండి 20 కిలోమీటర్లు నడుస్తూ జంతు, అడవుల రక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారికి తగిన గుర్తింపు లభించేలా చేయడమే ఉపాసన కొణిదెల బాధ్యతలు. ఉపాసన సైతం ఇలాంటి కర్తవ్యం తనకి దక్కినందుకు చాలా సంతోషిస్తున్నారు. ఫారెస్ట్, ఫ్రంట్ లైన్ హీరోలకు తగిన గుర్తింపు లభించేలా తనవంతు కృషి చేస్తానని అంటున్నారు.