ప్రస్తుతం ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులే హాట్ టాపిక్. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటంతో హిందుత్వ వాదులు తెగ ఆందోళన చెందుతున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగడమంటే హిందూ మతంపై దాడి జరిగినట్టే. తాజాగా రామతీర్థంలోని రాముడి విగ్రహం కూడా ధ్వంసం కావడంతో.. ఒక్కసారిగా ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నువ్వంటే నువ్వు.. అంటూ ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు మాటల యుద్ధం చేసుకునే వరకు వచ్చాయి.
అయితే.. ఈ దాడులు ఎవరు చేయిస్తున్నారో తెలియదు కానీ.. ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు, హిందుత్వ వాదులు, అందరూ జగన్ ను వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రిస్టియన్. అందుకే ఆయన ఇలా హిందూ మతంపై దాడులు చేయిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే.. ఒకటే పాట పాడుతోంది. జగన్ అధికారంలోకి వచ్చారు… ఏపీలో హిందూ మతంపై, దేవాలయాలపై దాడులు ప్రారంభం అయ్యాయి.. అంటూ ఆరోపిస్తోంది.
దానికి కౌంటర్ గా ఇదంతా చేసేది టీడీపీనేనని.. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు.. చంద్రబాబు, లోకేశ్ అని.. కావాలని వైసీపీని బ్లేమ్ చేయడానికి.. జగన్ పై బురద జల్లడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలు అంటూ డిఫెండ్ చేస్తున్నా.. ప్రభుత్వ వైఫల్యం కూడా దీనికి కారణమంటూ కొందరు ఆరోపిస్తున్నారు.
అయితే.. ఈ ఘటనపై తాజాగా టాలీవుడ్ యాక్టర్ సుమన్ స్పందించారు. నిజానికి సుమన్.. ఎప్పుడూ చంద్రబాబువైపు ఉంటారు. చంద్రబాబును చాలా సార్లు మెచ్చుకున్నారు కూడా. కానీ.. దేవాలయాలపై దాడుల విషయంలో మాత్రం.. ప్రతిపక్షాల కుట్ర వల్లనే ఇటువంటివి జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల కుట్ర ఉంది.. అని సుమన్ అన్నారంటే.. ఆయన పరోక్షంగా సీఎం జగన్ కు మద్దతు పలుకుతున్నట్టే కదా.