ప్రస్తుత కాలంలో చాలామంది హీరోలు ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే తర్వాత సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. అలా బాక్సాఫీస్ వద్ద డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
డబుల్ హ్యాట్రిక్ సాధించడం అరుదైన ఘనత కాగా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నాలుగుసార్లు ఈ అరుదైన ఘనతను సాధించారు. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడంతో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ, చంద్రమోహన్ ఒకసారి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. హిట్లర్ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధించినా ఇద్దరు మిత్రులు ఫ్లాప్ కావడంతో చిరంజీవి ఖాతాలో ఈ రికార్డ్ చేరలేదు.
నందమూరి బాలకృష్ణ 1986 సంవత్సరంలో వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకుని ఒకే ఏడాది అరు వరుస విజయాలను సొంతం చేసుకున్న అరుదైన ఘనతను సాధించారు. నాగార్జున సంతోషం సినిమా నుంచి శ్రీరామదాసు వరకు వరుస విజయాలతో ఈ రికార్డును అందుకున్నారు. ప్రేమించుకుందాంరా సినిమా నుంచి రాజా వరకు వెంకీ వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు.
పవన్ గోకులంలో సీత సినిమా నుంచి ఖుషి వరకు వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. నాని భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి నిన్నుకోరి వరకు వరుస సక్సెస్ లను అందుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. మరి కొందరు హీరోలు రాబోయే రోజుల్లో ఈ రికార్డును సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.