Chiranjeevi Is ‘Industry Pedda’ : ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కాకపోతే, కొందరు అలా ఒప్పుకోవడానికి ఇష్టపడరంతే. అక్కడే సమస్య ఎదురవుతోంది. తామే పుడింగులమని చెప్పుకునే కొందరు, చిరంజీవి పెద్దరికాన్ని ప్రశ్నిస్తుంటారు. అలా ప్రశ్నించేవారెవరూ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద మనుషుల్లా వ్యవహరించేందుకు సిద్ధపడరు.
సినిమా టిక్కెట్ల వివాదంలో మెగాస్టార్ చిరంజీవి పడ్డ కష్టం, చూపిన శ్రద్ధ, పోషించిన కీలక పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ విషయమై ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేశారు.
అసలు తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కారణమే మెగాస్టార్ చిరంజీవి.. అని వేదికపై సినీ ప్రముఖులు అభిప్రాయపడుతోంటే, అది చూసి తట్టుకోవడం పరిశ్రమలో కొందరికి సాధ్యపడటంలేదు. తెలుగు సినిమా వసూళ్ళ లెక్క ఎలా మారిందో ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. పరిశ్రమ బాగు కోసం చిరంజీవి ఏం చేశారో ఎన్వీ ప్రసాద్ వివరించారు.
చిరంజీవిని చూసి తామెలా సినిమాల్లోకి వచ్చిందీ పలువురు దర్శకులు చెప్పారు. ఇంతకన్నా ఇంకేం కావాలి.. చిరంజీవి పరిశ్రమ పెద్ద.. అనడానికి. కానీ, చిరంజీవి మాత్రం తాను పరిశ్రమ బిడ్డనేనని అంటారు. పరిశ్రమకు అవసరమైనప్పుడు తన సంపూర్ణ సహాయ సహకారాలుంటాయని చెబుతుంటారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.