ప్రముఖ హస్యనటుడు సారధి ఇకలేరు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి (83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన దాదాపు 372 పైగా చిత్రాల్లో నటించారు. అందులో సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్‌ రాముడు వంటి మరెన్నో చిత్రాలతో గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. అంతే కాదు సారధి విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు ,అగ్గిరాజు,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ,అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధియే చూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్‌లో నిర్మించిన చిత్రాలకు ఆయన సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారథి కీలక పాత్ర పోషించారు. నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు.
సారధి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితాను ఓసారి పరిశీలిద్దాం…

సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు, పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు, ఈ కాలపు పిల్లలు (1976), భక్త కన్నప్ప (1976), అత్తవారిల్లు (1977), అమరదీపం (1977), ఇంద్రధనుస్సు (1978), చిరంజీవి రాంబాబు, జగన్మోహిని (1978), మన ఊరి పాండవులు (1978), సొమ్మొకడిది సోకొకడిది (1978), కోతల రాయుడు (1979), గంధర్వ కన్య (1979), దశ తిరిగింది (1979), అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980), నాయకుడు – వినాయకుడు (1980), మదన మంజరి (1980), మామా అల్లుళ్ళ సవాల్ (1980), బాబులుగాడి దెబ్బ (1984), మెరుపు దాడి (1984) – అంజి, జగన్మోహిని, ఆస్తులు అంతస్తులు, శారద, అమరదీపం, ముత్యాల ముగ్గు, కృష్ణవేణి, శాంతి చిత్రాల తో పాటు ఇంకా మరెన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అంతే కాదు సారధి విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా! ధర్మాత్ముడు,,అగ్గిరాజు,,శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి,, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధియే చూసారు.