తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా, ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా కష్టం. ముంబై, చెన్నయ్, బెంగళూరు.. ఇలా ఏదో ఒక ‘పొరుగు’ స్టేటస్ వుంటేనే హీరోయిన్లు తెలుగు తెరపై రాణించగలరన్న గట్టి నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బలంగా నాటుకుపోయింది.
అసలు విషయమేంటంటే, పదహారణాల తెలుగమ్మాయ్ శ్రీలీల ‘పెళ్ళి సందడి’ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. ఇంతకు ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. పదహారణాల తెలుగమ్మాయ్ అయినా, అమ్మడు అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యిందండోయ్.
చిత్రమేంటంటే, అమెరికా నుంచి వచ్చినా.. తెలుగు యాక్సెంట్ అదిరిపోయింది. హీరోయిన్ ఫీచర్స్ ఆమెకు బోల్డన్ని వున్నాయ్.. కానీ, అదృష్టం కలిసి రావాలి కదా. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులే వేయించుకుంది. గ్లామర్ పరంగానూ ఆమెకు మంచి మార్కులు పడ్డాయ్. శ్రీకాంత్ తనయుడు రోహన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటించిన సినిమా ఈ ‘పెళ్ళి సందడి’, ఒకప్పటి రాఘవేంద్రుడి వెండితెర అద్భుతం ‘పెళ్ళి సందడి’ మ్యాజిక్కుని మాత్రం రిపీట్ చేయలేకపోయింది. ఇంతకీ, తెలుగమ్మాయ్ శ్రీలీల తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ అవుతుందా.? చాలా మంది పొరుగు భామలతో పోల్చితే, చాలా అందగత్తె అయిన శ్రీలీలకి ‘తెలుగమ్మాయ్’ అనే ట్యాగ్‌తోనే అసలు సమస్య.