TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇలా ఢిల్లీ వరకు వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో పంచాయితీ ముగిసిన తరువాత కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం ఇది జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది. ఈ క్రమంలోనే సీఎం కుర్చీ నుంచి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఈ వార్త తెలంగాణ రాజకీయాలలో చర్చలకు కారణమైంది.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా సుమారు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారని, ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం అదేనంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ 12 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నాయకత్వం వహించారు. ఇలా ఈ రహస్య భేటీ గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము భేటీ అయిన మాట వాస్తవమే కానీ అది రహస్య భేటీ కాదని అనిరుద్ రెడ్డి తెలిపారు.నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేముందని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. అయితే, పార్టీ అధిష్ఠానానికి చెప్పాల్సింది చాలానే ఉందని వ్యాఖ్యానించారు.
అతిత్వరలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీప్ దాస్ మున్షిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని వివరించారు. ఇక రెవెన్యూ మంత్రి వద్ద తాను ఏదో ఫైల్ పెట్టాను అంటూ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈయన స్పందించారు. తాను ఎలాంటి ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి వద్ద పెట్టలేదని, మరి నేను ఏ ఫైల్ పెట్టాను మల్లు రవి చెబితే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడారు. నా వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తూ అసలు వార్తలను ప్రచారం చేస్తే అసలు ఊరుకోను అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ మండిపడ్డారు.