మోహన్ బాబుకు ఓ స్పెషల్ టాలెంట్ ఉంది అదేంటో తెలుసా? ముక్కుసూటిగా మాట్లాడటం. తన డైలాగ్ లతో సినీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన మోహన్ బాబు డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ముక్కుసూటిగా మాట్లాడటమే ఆయనకు చాలాసార్లు ఎన్నో సమస్యలను తీసుకొచ్చింది. అయినా కూడా ఆయన మాత్రం తన మనస్తత్వాన్ని మార్చుకోరు.
ఇప్పుడు సినిమాలు గట్రా లేకున్నా కూడా ఆయన మాత్రం మారడంటే మారడు. ప్రస్తుతానికి పూర్తిస్థాయి రాజకీయాల్లో లేకున్నా వైఎస్సార్సీపీకి మోహన్ బాబు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక.. అసలు పాయింట్ కు వస్తే.. ఇటీవల మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇన్ని సంవత్సరాల నా సినీ, రాజకీయ జీవితంలో నాకు అసంతృప్తి మాత్రం రాజకీయాల్లోనే ఉంది. ఎందుకంటే.. రాజకీయాల్లో నన్ను ఒకడు దెబ్బ కొట్టాడు. మామూలుగా కొట్టలేదు. నన్ను దెబ్బ కొట్టి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇద్దరం కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. దాన్ని కూడా లాక్కున్నాడు. ఇప్పుడు అతడి గురించి నాకు మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. వాడు.. చచ్చిన పాము.. చచ్చిన పాముని కొట్టకూడదు. అందుకే వదిలేశా.. అంటూ చెప్పుకొచ్చారు.
అతడు ఎవరో కూడా అందరికీ తెలుసు. అతడి పేరు చెపడం నాకు ఇష్టం లేదు. మీకు కావాలంటే హిస్టరీలో చూసుకోండి. అతడెవరో తెలిసిపోతుంది. గత ముఖ్యమంత్రి ఎవరో తెలుసు కదా. ఆ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే మరిచిపో. అడ్జెస్ట్ అవ్వు అంటూ కొందరు నాకు సలహాలు ఇచ్చారు. ఒరేయ్ పిచ్చోళ్లారా… నా కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నొప్పి వచ్చేది నాకురా.. మీకు కాదురా.. వాడి కింద ఉంటూ.. వాడి వల్ల డబ్బులు కూడేసుకొని.. వాడికి కాపలా కుక్కలా కాపలా కాస్తూ.. నాకు సలహాలు ఇస్తారా? అంటూ వాయించాను. ఈరోజు వేల కోట్లకు అధిపతి అయ్యాడు.. అంటూ మోహన్ బాబు ఫైర్ అయ్యాడు. ఇక.. ఆ గత ముఖ్యమంత్రి ఎవరో అందరికీ తెలిసిందే. అది బహిరంగ రహస్యమే కదా.
మరో ప్రశ్నకు బదులుగా.. ఏపీలో వైఎస్ జగన్ పాలన పర్లేదన్నారు. వైఎస్సార్సీపీ కి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఫీజుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం స్పందన పాజిటివ్ గానే ఉన్నది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసలు ఫీజుల గురించి ఊసే ఎత్తలేదు. చంద్రబాబును ఎన్నోసార్లు ఫీజుల గురించి ఫోన్ చేసినా.. స్పందించలేదు. కానీ.. జగన్ మాత్రం త్వరలోనే ఫీజులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.. అని జగన్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు మోహన్ బాబు.
సినిమావాళ్లు రాజకీయాల్లో రాణించడం అనేది ప్రస్తుత జనరేషన్ లో చాలా కష్టం. ఒకప్పుడు రాణించారు. కానీ.. ఇప్పుడు కుదరదు. తరం మారింది. సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు.. అని అనుకుంటే అది మూర్ఖత్వమే.. అంటూ సినిమా, రాజకీయ ప్రస్థానంపై మోహన్ బాబు సమాధానం ఇఛ్చాడు.