టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లి ఇప్పుడు టీడీపీకే ఇబ్బందిగా మారిన కొడాలి నాని, టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలను టీడీపీ నాయకులు తిప్పికొట్టలేకపోతున్నారు. కొడాలి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు ఎంతమాత్రం కాదు. బాబును, బాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ, ఘోరంగా అవమానిస్తున్నారు. కొడాలి ఇంత చేస్తున్నా కూడా టీడీపీ నాయకులు మాత్రం ఆయనను కట్టడి చెయ్యలేకపోతున్నారు. నాని ఇలా రెచ్చిపోవడానికి ఒక రకంగా బాబే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
నాని వైఖరికి బాబే కారణం!!
కొడాలి నాని ఇలా రెచ్చిపోవడానికి ఒక రకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని తెలుస్తుంది. ఎలా అంటే బాబు అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో బలమైన నాయకుడిని నియమించి ఉంటే ఇప్పుడు కొడాలి నాని ఇలా రెచ్చిపోయి వారు కాదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.ఎన్నికల సమయంలో విజయవాడ నుండి అవినాష్ ను తెచ్చి పోటీ చేయించినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు అవినాష్ పార్టీ మారడంతో పార్టీకి బలమైన నాయకుడు లేరు. ఇప్పుడు రావి వెంకటేశ్వరావుకు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
మధ్యలో బలైన ఉమ
కొడాలి నాని టీడీపీలో చంద్రబాబు నాయుడుతో పాటు దేవినేని ఉమాను కూడా తరచూ విమర్శిస్తూ ఉన్నారు. కొడాలి నాని పదే పదే తనను టార్గెట్ చేస్తుండడంతో ఉమా మహేశ్వరరావు సైతం గుడివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి. రావికి తిరిగి ఇన్‌చార్జ్ పదవి దక్కడం వెనక ఉమాయే చక్రం తిప్పారని రావిని వ్యతిరేకించే వర్గం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉమా.. అటు చంద్రబాబు గుడివాడపై ఫోకస్ పెట్టి ఉంటే ఈ రోజు వీళ్లు ఇన్నీ బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం ఉండేదే కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని టీడీపీ నేతలు ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి.