లాక్ డౌన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోన ఎగ్జిబిటర్లు చాలా నష్టపోయారు. నెలల తరబడి థియేటర్లు మైంటైన్ చేయలేక కుదేలయ్యారు. త్వరలో థియేటర్లు ఓపెన్ కానున్న నేపథ్యంలో తగ్గిన టికెట్ ధరలతో మరిన్ని నష్టాలు చూడాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. దశాబ్దాల తరబడి థియేటర్ రంగంలో ఉన్నవారు సైతం భవిష్యత్తును తలుచుకుని భయపడుతున్నారు. అందులో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడ ఉన్నారు. సురేష్ బాబు చాలా ఏళ్ల నుండి ఇరు రాష్ట్రల్లో కొన్ని థియేటర్లను లీజుకు తీసుకుని రన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సొంత సినిమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ చూసుకుంటూ వచ్చిన ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
ప్రస్తుతం సురేష్ బాబు ‘నారప్ప, విరాటపర్వం, దృశ్యం-2’ లాంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ మూడు సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తగ్గిన టికెట్ ధరలతో అది వర్కవుట్ కాదనే ఆలోచనలో పడ్డారు ఆయన. అందుకే రిస్క్ తీసుకోకుండా ఆ మూడు చిత్రాలను ఓటీటీలకు విక్రయించాలని చూస్తున్నారట. ఓటీటీ సంస్థలు కూడ ఈ మూడు సినిమాల మీద ఆసక్తిగా ఉన్నాయి. మంచి ఆఫర్లతో సురేష్ బాబును సంప్రదిస్తున్నాయి. సో.. వాటిలో లాభదాయకమైన డీల్ దొరికితే సినిమాలను అమ్మేయాలని చూస్తున్నారట సురేష్ బాబు. మరి అంత పెద్ద నిర్మాత, ఎగ్జిబిటరే సినిమా హాళ్లలో విడుదల చేయడానికి జంకుతున్నారు అంటే మిగతా ఎగ్జిబిటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.