సూపర్ స్టార్ కృష్ణ.! తెలుగు సినీ పరిశ్రమకి ‘ది రియల్ లెజెండ్’.!

ఘట్టమనేని శివరామకృష్ణ అసలు పేరు.. కానీ, సూపర్ స్టార్ కృష్ణగా తనదైన ముద్ర వేశారు తెలుగు సినీ పరిశ్రమలో.! స్టార్‌డమ్ కొందరికే వస్తుంది.. ఆ స్టార్‌డమ్‌ని ఓ గౌరవంగా కొందరు మాత్రమే భావిస్తారు. సింగిల్ సినిమా స్టార్లు, ఈ మధ్య ఎలా ఎగిరెగిరిపడుతున్నదీ చూస్తున్నాం. దాదాపు మూడు వందల యాభై సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. ఏడాదికి పది, పదిహేను.. ఆ పైన సినిమాలు చేసిన ఘనత తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే వుంది. ఓ యాభై సినిమాలు చేసేంత ఓపిక, ఈ జనరేషన్ స్టార్ హీరోలనదగ్గవారిలో ఎంతమందికి వుంది.?

ఫస్ట్ సినిమా స్కోప్.. ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్.. ఫస్ట్ 70ఎంఎం.. ఇలా తెలుగు సినిమాకి ఆయన అనేక హంగులు అద్దారు.. తన సినిమాలతో. కేవలం నటుడిగానే కాదు, నిర్మాతగానూ, దర్శకుడిగానూ సూపర్ స్టార్ కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చాలా సినిమాల టైటిల్స్, భవిష్యత్తులో మళ్ళీ మనం చూడాల్సి రావొచ్చు. ఆయన నటించిన పాటల్ని మళ్ళీ మనం వేరే హీరోల సినిమాల్లో చూడాల్సి రావొచ్చు. సినిమాలు, సేవా కార్యక్రమాలు, రాజకీయాలు.. వాట్ నాట్.. సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏడాదే కృష్ణ తన కుమారుడ్ని కోల్పోయారు.. తన భార్యనీ కోల్పోయారు.. ఆ ఆవేదనతోనే ఆయన తుదిశ్వాస విడిచారు.