స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మీడియాతో పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి..
# ‘సీతారామం’లో అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడానికి కారణం?
– ‘సీతారామం’ కథ అద్భుతం. దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్ప కథ రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా వుంటాయి. మంచి మ్యూజిక్ రావాలంటే కథ మ్యూజిక్ ని డిమాండ్ చేయాలి. అలా మ్యూజిక్ ని డిమాండ్ చేసిన కథ సీతారామం. సీతారామం కు గొప్ప మ్యూజిక్ రావడానికి కారణం ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి. దర్శకుడు హనుతో ఇదివరకు ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం అద్భుతంగా వుంటుంది.
# పాటల్లో మంచి సాహిత్యం వినిపించింది. లిరిక్ రైటర్స్ తో మీకున్న బాండింగ్ గురించి చెప్పండి ?
– సీతారామం మ్యూజిక్ జర్నీ అద్భుతంగా సాగింది. కానున్న కళ్యాణం పాట రాసిన సిరివెన్నెల గారు సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు చాలా విషయాలు చెప్పారు. తెలుగు, తమిళ్, ఇలా అన్నీ భాషల్లోని అలంకారాలు గురించి వివరించారు. ఒకే లిరిక్ లో డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ లిరిక్స్ లో అదే ట్యూన్ ఎలా ప్రజంట్ చేయాలో చెప్పారు. కేకే గారు, అనంత్ శ్రీరామ్ లతో కూడా మంచి అనుబంధం వుంది. పాటలని డబ్బింగ్ లా కాకుండా తెలుగు, తమిళ్. మలయాళం భాషల్లో విడివిడిగా వాటి నేటివిటికి తగ్గట్టు ఒరిజినల్ గా చేశాం. ఇంతందం పాట ని తమిళ్ కోసం డిఫరెంట్ ట్యూన్ చేశాం.
# ఎస్పీ చరణ్ తో పాడించాలనే చాయిస్ ఎవరిది ?
– ఇది నిర్మాతల చాయిస్. అయితే ఈ విషయంలో నాకు పూర్తి స్వేఛ్చ వుంది. ది గ్రేట్ బాలు గారిలా మరొకరు పాడుతున్నారంటే పాడించుకోవడం ఆనందమే కదా.
# ఇంతందం పాటలో పిల్లలతో పాడించిన కోరస్ అద్భుతంగా వుంది.. ఈ ఆలోచన ఎవరిది ?
– పిల్లలతో కోరస్ పాడించాలానే ఆలోచన దర్శకుడు హను గారిది. ఈ పాట విన్నపుడు.. ఇక్కడ పిల్లలతో కోరస్ పాడిస్తే ఎలా వుంటుందని అన్నారు. రికార్డ్ చేశాం.. అద్భుతంగా వచ్చింది.
# ‘సీతారామం’లో నేపధ్య సంగీతం ఎలా వుండబోతుంది
– అద్భుతమైన నేపధ్య సంగీతం వినబోతున్నారు. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్,.. ఇలా విదేశీ వాయిద్య కారులతో పాటు దాదాపు 140మంది మ్యుజిషియన్స్ నేపధ్య సంగీతం కోసం పని చేశారు. అలాగే నేపధ్య సంగీతంలో చాలా రాగాల మీద వర్క్ చేశాం. సంప్రాదాయ సంగీతం పరంగా సీతరామం చాలా రిచ్ గా వుంటుంది. మ్యూజిక్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాం. నేను, నా భార్య, టీమ్.. రౌండ్ ది క్లాక్ పని చేశాం. నేను హైదరాబాద్ లో వుండి మ్యూజిక్ నోట్స్ రాసిస్తే,.. నా భార్య చెన్నై, కొచ్చి వెళ్లి అక్కడి సింగర్స్ తో రికార్డ్ చేసేవారు. ఇక్కడ నుండి నేను మానిటర్ చేసేవాడిని.
# మిగతా సినిమాలకి సీతారామం మ్యూజిక్ విషయంలో తేడా ఏమిటి ?
– ఇలాంటి స్టయిల్ లో ఇంత రిచ్ మ్యూజిక్ గతంలో నేను ఎప్పుడూ చేయలేదు. మ్యూజికల్ గా చాలా రిచ్ గా వుంటుంది. సింథటిక్, ఫ్లాస్టిక్ మ్యూజిక్ కాకుండా చాలా ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రాగాల విషయంలో రీసెర్చ్ కూడా చేశాను. 60, 80 దశకాలలో తెలుగు సినిమాలో ఎలాంటి రాగాలతో పాటలు వచ్చాయనే విషయంలో చాలా పరిశోధన చేశాను.
# లిరిక్ కి ట్యూన్ చేయడానికి ఇష్టపడతారా ?
– నా వరకూ లిరిక్ కి ట్యూన్ చేయడమే ఈజీ.
#సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి ఎలాంటి కసరత్తు చేస్తారు ?
– పాటలో ఎక్స్ ప్రెషన్ ఉండాలంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి మాటకి ఖచ్చితంగా అర్ధం తెలుసుకుంటాను. అప్పుడే ఎక్స్ ప్రెషన్ ని పట్టుకోగలం.
# సీతారామం లో ఎన్ని పాటలు వున్నాయి ?
– సీతారామంలో మొత్తం తొమ్మిది పాటలు వున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. నా ఫేవరట్ సాంగ్ ఇంకా విడుదల కావాల్సివుంది. ఇప్పటివరకూ విడుదలైన పాటల్లో ‘ఓహ్ సీత’ పాట నాకు చాలా ఇష్టం.
# మీకు ట్యూన్ చేయడానికి కష్టం అనిపించిన సందర్భం ఉందా ?
– సీతారామంలో సెకండ్ హాఫ్ లో ఒక పాట వస్తుంది. భాద, ఆనందానికి సంబధించిన పాట కాదు. మనల్ని వెంటాడే పాట అది. అలాంటి పాట చేయడం కష్టం. మెలోడి నా బలం.
# మీకు స్ఫూర్తిని ఇచ్చే సంగీత దర్శకుడు ?
– రజింత్ బరోట్. తమిళ్ లో ప్రభుదేవా హీరోగా వీఐపీ అనే సినిమాకి సంగీతం అందించారు. చాలా తక్కువ సినిమాలకే చేశారు. ఆయన సంగీతం నాలో చాలా స్ఫూర్తిని నింపింది. వీఐపీ పాటలు విని రెహ్మాన్ గారు చేశారా అనుకున్నాను. కానీ ఆ పాటలు చేసింది రంజిత్ బరోట్. తర్వాత ఆయన సంగీత దర్శకుడిగా కొనసాగలేదు. రెహ్మాన్ గారి ట్రూప్ లో మెయిన్ డ్రమ్మర్.
# మీ సంగీత ప్రయాణం ఎలా మొదలైయింది ?
– నా బాల్యం నుండే ప్రయాణం మొదలైయింది. మా అంకుల్ ఒకరు బుల్ బుల్ తరంగ్ అనే వాయిద్యం తెచ్చి ఇంట్లో పెట్టారు. అది శ్రద్ధగా వాయించే వాడిని. నా ఆసక్తి చూసి అమ్మనాన్న కీ బోర్డ్ కొనిపెట్టారు. అలా సంగీత ప్రయాణం మొదలైయింది.
# ఏ దర్శకులతో కలసి పని చేయాలనుకుంటున్నారు ?
– మిస్కిన్ గారి సినిమాలకి పని చేయాలని వుంది. మంచి కథ రాసే ఎవరైనాసరే వారితో కలిసి పని చేయాలనీ కోరుకుంటున్నాను. నా వరకూ మంచి సంగీతం ఇవ్వాలంటే మంచి కంటెంట్ వుండాల్సిందే.
# కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
మాధవన్ గారితో ఒక సినిమా చర్చల్లో వుంది.