Singer Chitra: ఎయిర్ పోర్ట్ లో గాయపడిన సింగర్ చిత్ర.. ఫోటోస్ వైరల్.. అసలేం జరిగిందంటే!

Singer Chitra: తెలుగు ప్రేక్షకులకు స్టార్ సింగర్ కెఎస్ చిత్ర గురించి, ఆమె పాడిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అద్భుతమైన స్వరంతో ఎన్నో ఏళ్లుగా కొన్ని వేలల్లో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సింగర్ చిత్ర. ఇప్పటికీ ఈవెంట్లలో ఒకవైపు పాటలు పాడుతూనే మరొకవైపు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఆమె పాడిన పాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఇటీవలే గాయని చిత్రకి ప్రమాదం జరిగింది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమే అని తేలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో పాటు అనేక రకాల వార్తలు వినిపించడంతో తాజాగా ఈ విషయం గురించి సింగర్ చిత్ర స్పందించారు. మలయాళంలో వచ్చే స్టార్‌ సింగర్‌ 10వ సీజన్‌ షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్‌ పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఒక అడుగు వేశాను. అంతే నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్‌ తప్పి కింద పడిపోయాను. అప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని న్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె బాగుండాలి అని కామెంట్లు చేస్తూనే అభిమానులు సెలబ్రిటీలు ఇలా బయట కనిపించినప్పుడు ఇబ్బందులకు గురి చేయడం ఇప్పటికైనా ఆపండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.