దుబాయ్‌లో మ‌హేష్ బాబు షూటింగ్.. లొకేష‌న్ పిక్స్ షేర్ చేసిన సూప‌ర్ స్టార్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ‌త ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు ప‌ర‌శురాం ద‌ర్శ‌కత్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో మొద‌లు కావ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. రీసెంట్‌గా దుబాయ్‌లో తొలి షెడ్యూల్ మొద‌లు పెట్టారు. చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న కీర్తి సురేష్ కూడా తొలి షెడ్యూల్‌లో పాల్గొంటుంది.

దుబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో సర్కారు వారి పాట చిత్రం తెర‌కెక్క‌నున్న నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్‌ని అక్క‌డ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ స్టార్ట‌ప్ కంపెనీ in5లో షూట్ కొన‌సాగుతుంది.ఈ విష‌యాన్ని మ‌హేష్ బాబు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. ఐఎన్ 5దుబాయ్‌లో స‌ర్కారు వారి పాట షూటింగ్ చేస్తుండ‌డం గొప్ప అనుభవం. మాకు స్వాగ‌తం పలికిన కంపెనీ వారికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ మ‌హేష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐఎన్‌5 అనేది విద్యార్ధ‌లు, ఔత్సాహిక వేత్త‌లు, ప్రొఫెష‌న‌ల్స్ కోసం నిర్వ‌హిస్తున్న ఫుల్ స‌ర్వీస్ బిజీనెస్ ఇంక్యుబేట‌ర్.

నెల రోజుల పాటు దుబాయ్‌లో షూటింగ్ జ‌ర‌పిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో త‌దుప‌రి షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నారు మేక‌ర్స్. చిత్రంలో మ‌హేష్ బాబు బ్యాంక్ ఉ ద్యోగి కొడుకుగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సినిమా కోసం మ‌హేష్ కొత్త హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే న్యూ హెయిర్ స్టైల్‌తో దిగిన ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు రాగా, వాటిని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఈ ఏడాది చివ‌ర‌లో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.