సినిమా సెలెబ్రిటీలు అంటే డబ్బుకు లోటు లేదు అనుకుంటారు. కానీ కొన్ని సార్లు వీళ్ళు కూడా ఫైనాన్సియల్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుంటారు. అనేక సందర్భాల్లో సెలెబ్రిటీలు చెక్ బౌన్స్ కేసులో కోర్ట్ కి వెళ్లారు. ఇప్పుడు తాజాగా ఒక టాప్ డైరెక్టర్ కి ఫైనాన్సియల్ ఫ్రాడ్ కేసులో కోర్ట్ ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకెళ్తే….తమిళ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కి ఈ చేదు అనుభవం ఎదురైంది. తమిళ సినిమాల్లో అత్యంత విజయవంతమైన కమర్షియల్ దర్శకుల్లో లింగుసామి ఒకరు. ఆనందం, రన్, భీమా, పందెం కోడి, ఆవారా, పందెం కోడి 2 లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించారు.
అయితే ఈ మధ్య అతని సినిమాలు అంతగా విజయం సాదించడంలేదు. తెలుగు హీరో రామ్‌తో ‘ది వారియర్’ సినిమాను లింగుసామి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది.
ఎన్ లింగుస్వామి కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై కొన్ని సినిమాలను నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌పైనే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో తెలుగు చిత్రాల నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి తమిళ డైరెక్టర్ లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. తమిళ హీరో కార్తి, సమంత జంటగా ఓ సినిమా తీయాలనుకున్నారు. కానీ అది ఏవో కారణాలవల్ల ఆగిపోయింది.
కార్తి, సమంత సినిమా మొదలు కాకపోవడంతో . పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న డబ్బును చెక్కు రూపంలో లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ తిరిగి చెల్లించారు. వీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో.. పీవీపీ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో సోమవారం (ఆగష్టు 22) ఈ కేసు చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణకు వచ్చింది. చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామి, అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్‌లకు న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అయితే కోర్టు తీర్పుపై లింగుస్వామి, ఆయన సోదరుడు అప్పీల్‌కు వెళ్లనున్నారట.