తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామాల్ని రానున్న రోజుల్లో చూడబోతున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు, ఆ పైన నాయకులు తెలంగాణలో విడివిడిగా పాదయాత్రలు చేయబోతున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అతి త్వరలో తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
పాదయాత్ర ఆమెకు కొత్త కాదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో అదో సంచలన రికార్డ్. తన రికార్డుని తానే అధిగమించాలని షర్మిల అనుకుంటున్నారు. తద్వారా అధికార పీఠమెక్కాలనీ షర్మిల ఆశిస్తున్నారు.
మరోపక్క, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.. అధిష్టానం నుంచి సానుకూల స్పందన వస్తే, పాదయాత్ర చేయడానికి నేను సిద్ధం..’ అని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు.
మరోపక్క, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా. కానీ, పార్టీ ముఖ్య నేతలు ఈ పాదయాత్రకు ఎంతవరకు సహకరిస్తారన్నదానిపై బండి సంజయ్ కొంత అయోమయంలో వున్నారు. ఇదిలా వుంటే, విపక్ష నేతలేనా.? తాము కూడా పాదయాత్ర చేస్తామని అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు చెబుతున్నారు.
షర్మిలకు ధీటుగా కవితతో పాదయాత్ర చేయిస్తే ఎలా వుంటుంది.? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పాదయాత్ర చేస్తే వచ్చే మైలేజీ ఎంత.? అన్నదానిపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహరచన చేస్తున్నారట. అయితే, సుదీర్ఘ పాదయాత్ర కాకుండా, మెరుపు పర్యటనలు తెలంగాణ అంతటా చేసి, అక్కడక్కడా చిన్న చిన్న పాదయాత్రలైతే మంచిదన్న ఆలోచన కేసీయార్ చేస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.