దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి, నాగచైతన్యలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి ‘సారంగ దరియా’ పాత విడుదలైంది. సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ చాలా ఏళ్ల నుండి అక్కడక్కడా వినబడుతూనే ఉంది. రేలా రే రేలా కార్యక్రమంలో వినబడిన నాటి నుండి పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటనే శేఖర్ కమ్ముల కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాలో వాడారు.. పాటను ప్రముఖ గాయని మంగ్లీ చేత పాడించారు. పాట క్రెడిట్ మొత్తం ఆమెకు వెళ్ళింది. దీంతో అసలు పాటను వెలుగులోకి తెచ్చిన గాయని కోమలి బయటికొచ్చారు.
ఆ పాట తనదని, తన అవ్వ నుండి ఆ పాటను సేకరించానని, తనతో పాడించకుండా వేరొకరితో పాడించారని ఆమె చెప్పుకొచ్చారు. వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపింది. శేఖర్ కమ్ముల మీద ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. పాటను వెలుగులోకి తెచ్చివ వారికి క్రెడిట్ ఇవ్వకపోవడమేమిటని నిలదీశారు. దీంతో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి పాడిన ‘సారంగ దరియా’ పాట నా మనసులో తిరుగుతూనే ఉంది. ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టు ‘సారంగ దరియా’ పాట రాయాలని సుద్దాల అశోక్ తేజగారిని కలిశా. ఆయన ఆ పాట పల్లవి తీసుకుని మంచి చరణాలు రాశారు. ఆ పాటను తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన కోమలితో పాడిద్దామని సుద్దాల గారు అన్నారు. వరంగల్ నుంచి ఆమెని రమ్మని కోరాం.. జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేను అన్నారు.
అందుకే వేరొకరి చేత పాడించాం. పాటలో ఆమెకు క్రెడిట్ తప్పకుండా ఉంటుంది. ఆడియో వేడుకలో ఆమె చేత పాటను పాడిస్తాం. అక్కడైతే విజిబులిటీ ఉంటుంది. ఆమెకు డబ్బులు కూడ ఇస్తాం అంటూ వివాదానికి ఫులుస్టాప్ పెట్టారు.