Sarkaru Vaari Paata Review : సర్కారు వారి పాట… ఒకటోస్సారే!!

Sarkaru Vaari Paata Movie Review

చిత్రం: సర్కారువారి పాట

కథ-కథనం-దర్శకత్వం : పరశురామ్‌ (బుజ్జి)

రేటింగ్ : 3.25/5

నటీనటులు : మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌, సముద్రఖని, ‘వెన్నెల’కిశోర్‌, నదియా, అజయ్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, బ్రహ్మజీ తదితరులు

ఎడిటర్‌ : మార్తాండ్‌ కె వెంకటేశ్‌

సినిమాటోగ్రఫీ : ఆర్. మధి

సంగీతం : యస్‌.యస్‌ తమన్‌

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్

నిర్మాతలు : నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపి ఆచంట

విడుదల తేది : 12 -05 -2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నేడు (మే 12,2022) భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు, ‘గీత గోవిందం’ లాంటి క్లాస్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా రాక కోసం అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ‘సర్కారు వారి పాట’ పేరులోనే ఓ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు పరశురామ్. ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూశారు. మరి ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూవచ్చిన ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథలోకి..

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్‌ (మహేష్ బాబు) అమెరికాలో స్థిరపడతాడు. తానెంతో కష్టపడి సంపాదించిన డబ్బును అక్కడ ఉన్నవాళ్లకు అప్పులిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తమ బ్యాంకును చీట్ చేసిన వారినుంచి తెలివిగా డబ్బులు వసూలు చేస్తుంటాడు. అతడి జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా డబ్బు విషయంలో ఎంతో నిబద్దతతో ఉంటాడు. అలాంటి మహేష్ ను చదువుకోవటానికి ఇండియా నుండి అమెరికాకి వచ్చిన కళావతి (కీర్తి సురేష్) మోసం చేసి అతడి వద్ద అప్పు తీసుకుంటుంది. అలా వాళ్లిద్దరి పరిచయం అప్పుతో మొదలవుతుంది. డబ్బు తిరిగి చెల్లించకుండా అతడిని చీట్ చేస్తుంది. తాను ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవడానికి నానా తంటాలు పడతాడు మహేష్. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఇండియా (వైజాగ్)లో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)ను కలుస్తాడు మహేష్. రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ మెలిక పెడతాడు. ఈ క్రమంలో కథ విభిన్నమైన మలుపు తిరుగుతుంది. అసలు మహేష్ టార్గెట్ ఏమిటి? ఇంతకీ ఈ రాజేంద్రనాథ్ ఎవరు? మహేష్ అతడిని ఎలా హ్యాండిల్ చేశాడు? మహేష్ ఇదంతా దేని కోసం చేశాడు ? అసలు మహేష్ గతం ఏమిటి ? అనేది అసలైన కథ.

విశ్లేషణ :

బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ మొదలవుతుంది. తొలి సగం ప్రేక్షలుకులను ఆకట్టుకునే రీతిలో సాగి.. మలిసగం పై ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, మహేష్ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ మాస్ ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే.. సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. సాగదీత కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండే హీరో ఫస్టాఫ్ లో హీరోయిన్ తో లవ్ స్టొరీతో నడిపేయగా ఓ ఆసక్తి కరమైన పాయింట్ తో సెకెండ్ ఆఫ్ యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఓ సమస్యను ఫేస్ చేయాల్సి రాగా, దానిని అతడు ఎలా సాల్వ్ చేశాడు అనే ఆసక్తి కలుగుతుంది. ఫస్టాఫ్ కథ కామెడీ అండ్ లవ్ స్టొరీతో నిండిపోగా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకోవడంతో ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సెకెండ్ ఆఫ్ స్టొరీ రొటీన్ గా అనిపించి నిరాశని కలిగిస్తుంది. సినిమాలో ఉన్న యాక్షన్, లవ్ అండ్ కామెడీకి ఆడియన్స్ కనెక్ట్ అయితే…సినిమా మహేష్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం, కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే నచ్చేలా సాగింది. దర్శకుడు పరశురామ్ తను అనుకున్న కథని సరిగా స్క్రీన్ పై చూపించలేక చతికిలపడ్డాడు. ఫస్టాఫ్ ని ఎంతో ఆసక్తికరంగా మలిచిన దర్శకుడు సెకండాఫ్ కి వచ్చేసరికి అదే టెంపోని కొనసాగించలేకపోయాడు.

ఎవరెలా చేశారంటే…

మహేష్ అద్భుతంగా నటించాడు. మరింత అందంగా కనిపించి స్క్రీన్ ప్రెజెన్స్ లో తనను బీట్ చేసే వారు లేరని మరోసారి నిరూపించాడు. ముఖ్యంగా మహేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మహేష్ కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక కీర్తీసురేశ్‌ మహేశ్‌ సరసన నటించి మంచి మార్కుల్నే కొట్టేసింది. కొన్ని సీన్లలో మహేశ్‌తో పోటిపడి నటించింది వీళ్ళిద్దరిమధ్య మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది. కీర్తి చాలా అందంగా ఉంది. తన పాత్రకు తగిన న్యాయం చేసింది. అలాగే మహేష్ -‘వెన్నెల’ కిషోర్ కాంబినేషన్‌ నవ్వుల్ని కురిపించింది. దర్శకుడు పరశురామ్‌ చెప్పిన రెండుగంటల నలభై నాలుగు నిమిషాల కథను మహేశ్‌బాబు ఒక్కడే తన భుజమ్మీద మోసుకుని ప్రేక్షకుల దగ్గరకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అన్నిటికి మించి మహేష్ మరోసారి తన నటనతో అబ్బురపరిచాడు. కీలకమైన పాత్రలో కనిపించిన నదియా తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ పాత్రలో ఆమె నటించిన విధానం.. ఎమోషనల్ సీన్స్ లో ఆమె హావభావాలు మెప్పిస్తాయి. విలన్ పాత్రలో నటించిన సముద్రఖని ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. ‘వెన్నెల’ కిషోర్ తన కామిక్ హావభావాలతో నవ్వించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, అజయ్ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. కమర్షియల్‌ హిట్‌ సినిమా పాటలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తమన్‌ ‘సర్కారువారి పాట’ సినిమాలోను సేమ్‌ ఫీట్‌ను కొనసాగించారు. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపధ్య సంగీతం భేష్. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. రామ్‌ లక్ష్మణ్‌ల ఫైట్స్‌ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువులు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.

చివరగా.. పరుశురామ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. మొత్తమీద కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘గీత గోవిందం’తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పరుశురామ్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షలను మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కొన్ని చోట్ల లాజిక్ లేని సన్నివేశాలు సినిమా స్థాయిని బాగా తగ్గించాయి. మరికొన్ని సీన్స్ వాస్తవానికి దూరంగా సాగి ప్రేక్షలకులకు విసుగు తెప్పించాయి. అయితే బలమైన కథాంశంతో, పాత్రలతో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు నెమ్మదిగా నడిపించారు. పైగా సినిమాలో లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. దీనికితోడు నాటకీయ సన్నివేశాలు, అలాగే కొన్ని చోట్ల స్లో కథనం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.