
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మహేష్ చాలా నమ్మకంగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్నో కథలు విన్న మహేష్ చివరకు పరశురామ్ కథను ఫైనల్ చేసుకున్నారు. లాక్ డౌన్ ముందే మొదలుకావాల్సిన సినిమా దాదాపు ఏడు నెలల ఆలస్యంగా మొదలైంది. దీంతో టీమ్ వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలని అనుకున్నారు. దుబాయ్ లో చిత్రీకరణ మొదలుపెట్టారు. ఎన్నో జాగ్రత్తల నడుమ అక్కడి షెడ్యూల్ ముగించారు.
తర్వాతి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కుదరలేదు. కోవిడ్ కారణంగా అమెరికా వెళ్లే వీలు లేకుండా పోయింది వారికి. దీంతో దుబాయ్ లొకేషన్లలోనే షూట్ జరపాలని భావించారు. అయితే అక్కడ కూడ నిబంధనలు కఠినతరం కావడంతో ఆ ప్లాన్ కూడ వర్కవుట్ కాలేదు. దాంతో గోవా వెళ్లి అక్కడ షూటింగ్ జరపాలనుకున్నారు. అయితే అది కూడ కుదిరేలా లేదు. కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా షూటింగ్ అనుమతులు దొరకడం కష్టంగా మారింది. వందల మందితో అవుట్ డోర్ వెళ్లడం అంత మంచిది కాదని నిర్మాతలు సైతం వెనకడుగు వేస్తున్నారు. అలా మహేష్ సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ షూటింగ్ ఆలస్యమవవుతోంది
