Samantha : సమంత ముంబైకి షిఫ్టయిపోతుందా.?

Samantha : నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక సమంత రేంజ్ పెరిగిందా.? తగ్గిందా.? అంటే, పెరిగిందనే చెప్పాలి.. కెరీర్ పరంగా చూస్తే. రికార్డు స్థాయి రెమ్యునరేషన్ తీసుకుని, ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా సమంత తన సత్తా చాటి చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ పాట మార్మోగిపోతోంది. వివిధ దేశాల్లోనూ ‘ఊ అంటావా..’ పాట చక్కర్లు కొడుతోంది.

ఇదిలా వుంటే, సమంత తెలుగులో ఓ రెండు సినిమాలకు కమిట్ అయ్యింది.. ‘శాకుంతలం’ కాకుండా. మరోపక్క, తమిళంలోనూ సమంత సినిమాలు చేస్తోంది. ఇంతేనా.? బాలీవుడ్‌లోనూ సమంత రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సౌత్ సినిమాల లెక్క వేరు, బాలీవుడ్ సినిమాల లెక్కవేరు. బాలీవుడ్ సినిమాలు చేయాలంటే, మకాం అక్కడికి మార్చేయాల్సిందేనన్న అభిప్రాయం చాలామందిలో బలంగా నాటుకుపోయింది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. సమంత కూడా, ముంబైకి షిఫ్టయిపోయి, కొన్నాళ్ళపాటు అక్కడినుంచే చెన్నయ్, హైద్రాబాద్‌లకు అవసరమైతే షటిల్ సర్వీస్ చేయాలనుకుంటోందట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో ఓ ప్రతిష్టాత్మక సంస్థ సమంతతో సినిమాలు చేయాలనుకుంటోందట. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయనీ, ఏకబిగిన మూడు ప్రాజెక్టులు సమంతతో సదరు బ్యానర్ చేయబోతోందనీ అంటున్నారు. అదే నిజమైతే, సమంత ముంబైకి షిఫ్టింగ్ ఖాయమే కావొచ్చు.