అక్కినేని నాగచైతన్య, సమంత ఇటీవలే తమ వైవాహిక బంధానికి అర్థాంతరంగా ముగింపు పలికిన విషయం విదితమే. ఈ విషయమై ఇరువురి నుంచీ అధికారిక ప్రకటన వచ్చింది. ఇకపై తమ జీవితాలు వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగుతాయని ఇరువురి ప్రకటన సారాంశం. సినీ పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం.
నిజానికి, విడాకుల్ని వివాదంగా చూడటం సబబు కాదు.. సినిమా రంగంలోనే కాదు, మామూలు సమాజంలోనూ విడాకులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో.
ఇదిలా వుంటే, విడాకుల తర్వాత సమంత ఏదన్నా కొత్త తెలుగు సినిమాకి కమిట్ అయ్యిందా.? లేదా.? అన్న విషయమై ఆరా తీసేస్తున్నారు కొందరు దురభిమానులు. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా చేస్తోంది. సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది.. విడుదలవడమే తరువాయి.
మరోపక్క తమిళంలో మాత్రం సమంత మూడు సినిమాలు చేయాల్సి వుంది. హిందీలో కూడా ఓ సినిమాకి కమిట్ అయినట్లే ప్రచారం జరుగుతోంది. ‘తెలుగులో సమంత సినిమాలు చేయడం అంత తేలిక కాదు ఇకపై. ఎందుకంటే, ఆమె విపరీతమైన ట్రోలింగ్, నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది..’ అనే అభిప్రాయాలు కొందరు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
‘విడాకుల విషయంలో ఈ ఆడ, మగ.. వివాదమేంటి.? ఆడవాళ్ళను మాత్రమే ఈ విషయంలో కించపర్చడం ఎంతవరకు సబబు.?’ అన్నది సమంత ఆవేదనగా కనిపిస్తోంది.