సమంత రగడ: న్యూస్ ఛానళ్ళు వర్సెస్ యూ ట్యూబ్ ఛానెళ్ళు

న్యూస్ ఛానళ్ళలో చెత్త భరించలేక, ఆ న్యూస్ ఛానళ్ళు ఆయా రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయిన వైనాన్ని భరించలేక.. సోషల్ మీడియాని ఎంచుకుంటున్నారు జనం ఈ రోజుల్లో. న్యూస్ ఛానళ్ళలో వచ్చే వార్తలకంటే, సోషల్ మీడియాలోనే కాస్తంత విశ్వసనీయమైన వార్త దొరుకుతోందనే అభిప్రాయం లేకపోలేదు. వెబ్ మీడియా కావొచ్చు, యూ ట్యూబ్, సోషల్ మీడియా వేదికలు కావొచ్చు.. వీటికి ఆదరణ పెరుగుతున్నది ఇందుకే.

సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించి తొలుత న్యూస్ ఛానళ్ళలో రచ్చ మొదలైంది. అనేకానేక విశ్లేషణలూ కనిపించాయి. ఇప్పుడేమో న్యూస్ ఛానళ్ళు యూ ట్యూబ్ మీద పడ్డాయి. ఏకంగా, ‘యూ ట్యూబ్ క్రిమినల్స్’ అంటూ న్యూస్ ఛానళ్ళు రచ్చ మొదలెట్టాయి. మరి, యూ ట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఊరుకునే అవకాశమే వుండదు కదా.?

న్యూస్ ఛానళ్ళ బాగోతాన్ని సోషల్ మీడియాలో ఎండగట్టేస్తున్నారు. ఇంకా చిత్రమైన విషయమేంటంటే, న్యూస్ ఛానళ్ళలోనే న్యూస్ ఛానళ్ళ తీరుని ఎండగట్టేశారు కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళ ప్రతినిథులు. దాంతో, ఆయా న్యూస్ ఛానళ్ళ ప్రతినిథులే కాదు, వీక్షకులూ ఒకింత అవాక్కయ్యారు.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు, న్యూస్ ఛానళ్ళ అతి అంతా ఇంతా కాదు. దాన్ని ఎండగట్టింది సోషల్ మీడియా అలాగే యూ ట్యూబ్ ఛానళ్ళే. వెబ్ మీడియా కూడా ఎప్పటికప్పుడు న్యూస్ ఛానళ్ళ తాట తీస్తూనే వుంది.

సమంత ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో, ఆమెకు కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ళు క్షమాపణ చెప్పాయి. మరి, న్యూస్ ఛానళ్ళు అలా ఎవరికైనా క్షమాపణ చెప్పే పరిస్థితి వుంటుందా.? వస్తుందా.?