టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో నేనొక్కడినే పోరాడుతున్నా. దయచేసి కనీసం 25 నుంచి 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించండి… అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గళ్ల పట్టుకొని మరీ హైదరాబాద్ ను అభివృద్ధి చేయిస్తాం.. అంటూ మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను రేవంత్ ఎక్కు పెడుతున్నారు.
67 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం.. అంటూ సంకలు గుద్దుకుంటున్నారు కదా. మరి… 67 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు హైదరాబాద్ మునిగిపోయింది. చివరకు మూసీ నదికి నాళాలను కూడా నిర్మించలేకపోయారు. వరద సాయం అంటూ మరో అక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. పేదలకు, నిజమైన వరద బాధితులకు ఆ సాయం అందనే లేదు. మధ్యలోనే టీఆర్ఎస్ నాయకులు గుటకాయస్వాహ చేసేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏవి? ఇంకెప్పుడు ఇస్తరు. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అయింది. ఆరేళ్లలో చేయలేనివి.. చేయ చేతగానివి.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిపిస్తే చేసి చూపిస్తారట. వీళ్లవన్నీ పచ్చి అబద్ధాలు.. వీళ్లు మాటలు అస్సలు నమ్మొద్దు.. అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.