తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాబోయే ఎన్నికల గురించే చర్చ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరోవైపు నిజామాబాద్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలు.. అన్నీ ఒకేసారి వస్తుండటంతో పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి.
అయితే.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో ఉందని మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎవరు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం దేనికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని ఆయన దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ పార్టీ చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి లేదని.. రాములు నాయక్, భూపతిరెడ్డి లాంటి వారిపై అనర్హత వేటు వేసినప్పుడు కేసీఆర్ నీతులు చెప్పి.. ఇప్పుడు చేసేదేంటని ప్రశ్నించారు.
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలంటూ మేము అభ్యర్థించినా.. ఎన్నికల సంఘం అధికారులు స్పందించడం లేదని రేవంత్ మండిపడ్డారు. క్యాంపు రాజకీయాలపై ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు. కేసీఆర్.. నీతులు చెప్పడం కాదు.. ఆచరించి చూపించాలి. పార్టీ మారిన నేతల అనర్హత వేటుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం.. అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.